– సాయంత్రం 6 గంటలకు డిపోలో రిపోర్టు చేసిన వారే ఉద్యోగులు
– చేయని వారు మాజీ ఉద్యోగులు
– సంఘాలతో ఎలాంటి చర్చలు ఉండవు
– సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయాలు
శనివారం సాయంత్రం 6 గంటల లోపు ఆయా ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆ సమయంలోగా విధుల్లో చేరని వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కార్మికులతో చర్చల కోసం నియమించిన సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీ కూడా రద్దయిపోయింది. ట్రాన్స్ పోర్టు కమిషనర్ గా సందీప్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగానే వ్యవహరించాలని, క్రమశిక్షణ కాపాడాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, పార్లమెంటు సభ్యులు కె.కేశవ రావు, నామా నాగేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండా ప్రకాశ్, రంజిత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె..జోషి, డిజిపి మహేందర్ రెడ్డి, అడిషనల్ డిజిపి జితేందర్, సీనియర్ అధికారులు సోమేశ్ కుమార్, సునిల్ శర్మ, రామకృష్ణ రావు, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించి, పరిష్కరించడానికి ప్రభుత్వం సంసిద్దంగా ఉందనే విషయాన్ని తెలిపినప్పటికీ కార్మిక సంఘాల నాయకులు సమ్మె కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు అధికారులు చెప్పారు. ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో, దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా వచ్చే ఆదాయం ఎంతో కొంత ఉపయోగపడుతుందని, ఈ సమయంలోనే ఆర్టీసీకి నష్టం తెచ్చే విధంగా యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడం పట్ల ప్రభుత్వం తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ఆర్టీసీలో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీన్ని ఉల్లంఘించి సమ్మె చేయడం చట్ట విరుద్దమని అధికారులు అభిప్రాయపడ్డారు. చట్ట వ్యతిరేకంగా సమ్మె చేస్తే కార్మికులను ఉద్యోగంలోంచి తొలగించే అధికారం సంస్థకు ఉందని చెప్పారు.ఆర్టీసీ సమ్మె విషయంలో అధికారులు చట్ట ప్రకారమే నడుచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆరు గంటల లోగా విధుల్లో చేరిన వారిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, మిగతా వారిని తమంతట తాము ఉద్యోగాలు వదులుకున్న వారిగానే పరిగణించాలని ఆదేశించారు. ఆర్టీసీ యూనియన్ నాయకుల ఉచ్చులో పడి, కార్మికులు సంస్థకు నష్టం చేయవద్దని, తమ ఉద్యోగాలు తామే పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని సిఎం సూచించారు. కార్మికుల డిమాండ్లపై ఇకపై ఎలాంటి చర్చలు ఉండవని సిఎం స్పష్టం చేశారు. ఆర్టీసీని కాపాడడానికి ప్రభుత్వం ఎంతో చేసిందని, కానీ ఆర్టీసీ కార్మికులే ఆర్టీసీని ముంచే పని చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడడం కష్టమని సిఎం అభిప్రాయపడ్డారు.ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అధికారులు చేసిన ప్రయత్నాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీలో పదివేల బస్సులు నడుస్తున్నాయని, ఇందులో 2100 బస్సులు ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులని అధికారులు చెప్పారు. మరో ఐదు వేల మంది తాత్కాలిక డ్రైవర్లుగా చేయడానికి ముందుకు వచ్చారన్నారు. దీంతో 7వేలకు పైగా బస్సులు నడపడం సాధ్యమతుందని చెప్పారు. ఆర్టీసీలో మైలేజ్ అయిపోయిన 2,600 బస్సుల స్థానంలో అద్దె బస్సులు తీసుకోవాలని, శనివారమే ఇందుకోసమే నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికిప్పుడు ప్రజల అసౌకర్యాన్ని వీలయినంత తగ్గించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు తెప్పించాలని, రాష్ట్రంలోని ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు వాహనాల ఆపరేషన్లపై కాస్త ఉదారంగా ఉండాలని చెప్పారు. ప్రైవేటు వాహనాలకిచ్చే పర్మిట్ రుసుంలో 25 శాతం రాయితీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. సరిహద్దులో ఉన్న జిల్లాలకు దాని సరిహద్దులో ఉన్న రాష్ట్రాల నుంచి ప్రైవేటు బస్సులను తెప్పించాలని ఆదేశించారు.సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వహించే ఉద్యోగులు, కార్మికులకు తగిన భద్రత కల్పించాలని డిజిపిని సిఎం ఆదేశించారు. బస్సు డిపోల వద్ద భద్రత కల్పించాలని, బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సిఎం కోరారు.
Comments
Post a Comment