తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన సోమవారం ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేసారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామసంకీర్తనలు, పలురకాల భజనల నినాదాలు మిన్నుముట్టాయి.
అనాదికాలంనుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలు పూన్చిన రథంపై విహరిస్తాడు.ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉన్నది.
తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ”రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే” అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా తిరుమల తిరుపతి దేవస్థానమువారు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీథులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.
రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉన్నది. కఠోపనిషత్తులో ఆత్మకూ శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీథులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరంవేరనీ, సూక్ష్మశరీరంవేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వ జ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు. కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితంగా ఉన్నది.
Comments
Post a Comment