Skip to main content

ధర్మాడి సత్యంకు రాసిన లేఖలో ప్రభుత్వాన్ని విమర్శిస్తారా?: చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఆగ్రహం

 
గోదావరిలో మునిగిన బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మాడి సత్యంకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను విమర్శించారు. దీనిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బోటు వెలికితీసిన ధర్మాడిని టీడీపీ సన్మానించాల్సింది పోయి, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లేఖ రాస్తారా అని ఈ లేఖలో ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలైన చంద్రబాబుకు మతిపోయినట్టుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధర్మాడి సత్యం లాంటి వ్యక్తి తమ కాకినాడలో వుండటాన్ని గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. బోటు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదని విమర్శించారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నీట మునిగిన వరి పొలాలను అధికారులతో కలిసి కన్నబాబు పరిశీలించారు. కరప మండలం వేములవాడ, వాకాడ గ్రామంలోని పొలాలను పరిశీలించారు. తమకు జరిగిన నష్టం గురించి మంత్రికి చెప్పిన కౌలు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.   

Comments