Skip to main content

అనుభవజ్ఞుడని నమ్మి ప్రజలు గెలిపిస్తే.. ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు: విజయసాయిరెడ్డి

అనుభవజ్ఞుడని నమ్మి ప్రజలు గెలిపిస్తే చంద్రబాబు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఎన్టీపీసీ సహా విద్యుత్ సంస్థలకు రూ. 20 వేల కోట్లపైనే బకాయిలు పెట్టి పోయారని విమర్శించారు. జెన్ కోను ధ్వంసం చేసి ప్రైవేటు సంస్థలకు దోచి పెట్టారని అన్నారు. డిస్కమ్ లను అప్పుల్లో ముంచిన చంద్రబాబు... ఇప్పుడు చీకటి రోజులు వచ్చాయంటూ దొంగ ఏడుపు మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ తో 1.27 లక్షల ఉద్యోగాలు వచ్చాయని... ప్రతి ఏటా నియామకాలు ఉంటాయని సీఎం జగన్ ప్రకటించారని విజయసాయి అన్నారు. బిగ్గరగా ఏడవండి చంద్రబాబు గారూ... మీ శాపనార్థాలు నిరుద్యోగులకు ఆశీర్వాదాలుగా మారతాయి అని వ్యాఖ్యానించారు.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్మారక సభలో కూడా పోలవరం రివర్స్ టెండరింగ్ నే చంద్రబాబు కలవరించారని సాయిరెడ్డి అన్నారు. గతంలో రూ. 650 కోట్లు ఎక్కువ కోట్ చేసిన మేఘా సంస్థ ఇప్పుడు తక్కువకు ఎలా కోట్ చేసిందని గగ్గోలు పెడుతున్నారని... కమిషన్ల కోసం అప్పుడు మీరు కక్కుర్తి పడ్డారని, ఇప్పుడు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, అదే తేడా అని చెప్పారు

Comments