తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ``ఎస్.వి.రంగరావుగారు నా అభిమాన నటుడు. ఆయనతో మా తండ్రీగారికి నటించే అవకాశం దక్కింది. నాన్నగారు ఆయన నటనా కౌశలం గురించి నాతో ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ కారణంగానే ఇప్పటికీ అందరి మదిలో నిలిచిపోయారు. ఆయన నటనలోని గొప్పదనం వల్లే ఆయనకు జకార్తా అవార్డు వచ్చింది. అలాగే ఆయన నటుడిగా ఇచ్చిన స్ఫూర్తితోనే నేను మద్రాసుకు వెళ్లాను. ఏడాది నుండి ఈ జిల్లాకు రావడానికి ప్రయత్నిస్తుంటే ఇప్పటికి కుదిరింది. నన్ను మీ బిడ్డగా ఆదరిస్తున్నాను. అక్కున చేర్చుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కథను సినిమాగా చేశాను. ఆ సినిమాను అందరూ ఆదరిస్తున్నారు. యస్.వి.రంగారావుగారు ఉండుంటే శభాష్ అని నన్ను మెచ్చుకుని ఉండేవారు`` అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పైడి కొండల మాణిక్యాల రావు, వట్టి వసంతకుమార్, ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, వాసుబాబు, ఎం.ఎల్.సి ఆర్ సూర్యారావు, ఏలూరు మాజీ ఎం.ఎల్.ఎ బడేటి బుజ్జి , రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment