భారతదేశానికి శిరస్సు వంటి జమ్మూకశ్మీర్ అధికారికంగా రెండు ముక్కలైంది. బుధవారం అర్ధరాత్రి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (జమ్మూకశ్మీర్, లడక్) అవతరించింది. ఈ నేపథ్యంలో భారత్ లో రాష్ట్రాల సంఖ్య ఒకటి తగ్గగా... కేంద్రపాలిత ప్రాంతాలు మరో రెండు పెరిగాయి. జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన మూడు నెలల తర్వాత ఈ రాష్ట్రం నేటితో రెండుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్ శాసనసభ ఉండే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు కాగా, లడక్ శాసనసభ లేని యూటీగా ఏర్పడింది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు లెఫ్టినెంట్ గవర్నర్ల ఆధ్యర్యంలో ఉంటాయి.
నిన్న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం, ఇకపై జమ్మూ కశ్మీర్ ప్రజలు పర్మినెంట్ రెసిడెంట్స్ హోదాను కోల్పోతారు. అంతేకాదు, ఇకపై అక్కడి ఆస్తులను కొనుగోలు చేసే అధికారం ఇతర రాష్ట్రాల్లోని ప్రజలందరికీ లభిస్తుంది. అక్కడ ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని దాదాపు 560 సంస్థానాలను భారత్ లో విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా జమ్మూకశ్మీర్ రెండు ముక్కలైంది. ఈ రోజు మన దేశం 'జాతీయ ఐక్యతా దినోత్సవం'గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
జమ్మూకశ్మీర్ కేంద్రపాలితమైన నేపథ్యంలో, ఇకపై అక్కడి పోలీసులతో పాటు, లా అండ్ ఆర్డర్ కేంద్రం పరిధిలోకి వచ్చింది. అయితే, పాలనాపరమైన విషయాలను మాత్రం అక్కడి ప్రభుత్వం చూసుకుంటుంది. లాడక్ మాత్రం పూర్తి స్థాయిలో కేంద్రం అజమాయిషీలో ఉంటుంది.
Comments
Post a Comment