Skip to main content

ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

 
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
కేబినెట్‌ నిర్ణయాలివే..
1 నుంచి 12 వరకు చదివే విద్యార్థులకు అమ్మ ఒడి పథకం వర్తింపు. విద్యార్థుల తల్లులు లేదా వారి సంరక్షులకు అందజేసేందుకు మంత్రివర్గం ఆమోదం. ఏటా జనవరిలో ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ.
గర్భవతులు, బాలింతలు, ఆరునెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు అదనపు పౌష్ఠికాహారం అందించాలని నిర్ణయం. గుర్తించిన 77 మండలాల్లో  ఈ పథకం అమలు.
కృష్ణా, గోదావరి కాల్వల శుభ్రం చేసేందుకు శుద్ధి మిషన్‌ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం. సీఎం ఛైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్‌ ఛైర్మన్‌గా మిషన్‌ ఏర్పాటు.
షెడ్యూల్డు కులాల కార్పొరేషన్‌ను మూడుగా విభజించాలని నిర్ణయం. మాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, మాదిగ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రెల్లి, ఇతరకులాల కార్పొరేషన్‌గా విభజించేందుకు కేబినెట్‌ ఆమోదం.
వివిధ రంగాల ద్వారా ప్రజాసేవచేసేవారికి  వైఎస్సార్‌ లైఫ్‌టైం అవార్డు అందించాలని మంత్రివర్గం నిర్ణయం. విద్య, సామాజిక సేవ, వైద్యం, ఇంజినీరింగ్‌, వాణిజ్యం, పరిశ్రమలు, సాహిత్యం, కళలు, క్రీడా రంగాల్లో విజయాలు సాధించి సమాజహితం కోసం కృషి చేసిన వారిని గుర్తించాలని నిర్ణయం. ఏటా జనవరి 26న 50 మందిని, ఆగస్టు 15న 50మందిని ఎంపిక చేసి ఈ అవార్డు అందించేందుక కేబినెట్‌ ఆమోదం. ఈ అవార్డు కింద రూ.10లక్షల నగదు అందజేతకు నిర్ణయం.
హజ్‌, జెరూసలేం వెళ్లే యాత్రికులకు ఇస్తున్న ఆర్థిక సాయాం పెంచేందుకు కేబినెట్‌ నిర్ణయం. రూ.3లక్షల లోపు ఆదాయం నుంచి ఉన్నవారికి  ప్రస్తుతం ఉన్న రూ.40వేల నుంచి రూ.60వేలకు పెంపు. రూ.3లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి రూ. 20వేల నుంచి రూ.30వేలకు పెంచాలని నిర్ణయం.
స్టోన్‌ క్రషింగ్‌ యూనిట్లు గుర్తించి ప్రోత్సహించాలని కేబినెట్‌ నిర్ణయం. ప్రభుత్వం జీవో ఇచ్చిన ఆరు నెలలోపు కంకర నుంచి రోబో శాండ్‌ తయారు చేయటానికి రూ.50లక్షల నుంచి రూ.1.50 కోట్లకు వరకూ పావలా వడ్డీకే రుణాలు అందించాలనే నిర్ణయానికి ఆమోదం.  ప్రభుత్వ నిర్మాణాలకు 50 కిలోమీటర్ల లోపు ఉన్న స్టోన్‌ క్రషింగ్‌ యూనిట్ల నుంచి 20 శాతం రోబో శాండ్‌ తప్పని సరిగా వినియోగించాలని నిర్ణయం.
అభ్యంతరంలేని ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలను 300 గజాల వరకు రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయం. తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండి 100 గజాల్లో  ఇల్లు నిర్మించి ఉంటే ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్‌. 100 గజాలు నుంచి 300 గజాల వరకు  ఉన్న ఆక్రమణలకు మార్కెట్‌ ధరను జిల్లా కలెక్టర్లు నిర్ణయించి రెగ్యులరైజ్‌ చేసేందుకు ఆమోదం. ఆ స్థలాలకు ఐదేళ్ల వరకు లాకింగ్‌ పిరియడ్‌. ఆ తర్వాత లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు. గతంలో పేదలకు ఇచ్చిన  స్థలాలను మరొక పేదవారు కొనుగోలు చేస్తే వారి తరఫున కూడా రెగ్యులరైజ్‌ చేయాలని కేబినెట్‌ నిర్ణయం.
గ్రామీణ, వార్డు స్థాయిలో 397 అదనపు జేఎల్‌ఎం పోస్టులకు మంత్రివర్గం ఆమోదం.
గత ప్రభుత్వాల దోష నిర్ణయాల వల్ల ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఉపశమనం కల్పించేందుకు డిస్కంల నిధుల కోసం బాండ్ల జారీకి కేబినెట్‌ ఆమోదముద్ర.
హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీకి ఆమోదం.
రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సాంకేతికంగా అండగా ఉండటానికి, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడానికి, రైతు నష్టాలు తగ్గించడానికి 147 గ్రామీణ నియోజకవవర్గాల్లో  వైఎస్‌ఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లు  ఏర్పాటు. జిల్లా స్థాయిలో ఒక అగ్రి ల్యాబ్‌, నాలుగు ప్రాంతీయ కోడింగ్‌సెంటర్ల ఏర్పాటు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసే అగ్రిల్యాబ్‌ల ద్వారా ఎరువులు, పురుగుమందులు, విత్తనాల నాణ్యత తెలుసుకునేందుకు భూసార పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం. 2020 మార్చి నుంచి అగ్రి ల్యాబ్‌లు ప్రారంభం. 46 నియోజకవర్గాల్లో అక్వాల్యాబ్‌లు ఏర్పాటుకు ఆమోదం.
నవంబర్‌ 7 నుంచి అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ చెల్లింపులు ప్రారంభం. రూ.20వేల లోపు డిపాజిట్‌ దారులకు డబ్బులు చెల్లించేందుకు కేబినెట్‌ నిర్ణయం. దీనికోసం రూ.264 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదముద్ర. దీంతో 3,69,659 మంది బాధితులకు లబ్ధి.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి: పవన్‌

 రైతు భరోసా పథకాన్ని పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్‌.. తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి  ఏడాదికి రూ.12,500  అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించి... కేంద్రం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే  అందుకు కారణాలను రైతులకు చెప్పి,  వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.