ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. 729 మందిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. సమ్మె కార్మికుల హక్కు అని అన్నారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమనీ, కార్మికులు కాదన్నారు. రాయితీల డబ్బును ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ఏపీలో ఆర్టీసీ విలీనమైందని గుర్తు చేశారు. ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం పంతాలు పట్టింపులకు పోవద్దని కోరారు. 2013లో ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఆర్టీసీ విలీనంపై ఉత్తర్వులు వెలువడ్డాయని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినందున ఆ ఉత్తర్వులు అమలు కాలేదన్నారు. ఆర్టీసీ విలీనం అన్నది కొత్త డిమాండ్ కాదన్నారు. బతుకమ్మ, దసరా పండుగ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సీఎం కేసీఆర్ చొరవ చూపాలని సూచించారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ తరహాలో రవాణా రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తే కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సమ్మెను నివారించాలని కోరతామన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించామనీ, ఆ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తామనీ అన్నారు.
Comments
Post a Comment