Skip to main content

ఆర్టీసీ భూమలు లీజులు బయటపెట్టండి


భూములు కాజేసేందుకే ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర
మండిపడ్డ రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌,అక్టోబర్‌7(జనం సాక్షి): ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. డీజిల్‌పై పన్నులతో ఆర్టీసీ కుదేలవుతోందన్నారు. విమానాల ఇంధనంపై వ్యాట్‌ను 16శాతం నుంచి ఒకశాతానికి తగ్గించారని తెలిపారు. ప్రభుత్వానికి ఏడాదికి రూ.300 నుంచి 500 కోట్ల నష్టం వస్తోందని చెప్పారు. ఆర్టీసీ డీజిల్‌పై వ్యాట్‌ ఎందుకు తగ్గించడం లేదని, వ్యాట్‌ తగ్గిస్తే ఆర్టీసీకి ఏడాదికి రూ.700 కోట్ల లాభం వస్తుందని తెలిపారు. విడిభాగాలపై రూ.150 కోట్ల పన్నులు విధిస్తోందని,
బస్‌పాస్‌ రాయితీలు మూడేళ్లుగా రూ.700 కోట్లు బకాయిలున్నాయని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. నష్టాలను తగ్గించకుండా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన సీఎం కేసీఆర్‌కు ఇప్పటికిప్పుడు రాలేదు. ఎలక్టిక్ర్‌ బస్సుల తయారీ కంపెనీ కోసమే ఆర్టీసీ ప్రైవేటీకరణ. మేఘా ప్రణాళికతోనే ఆర్టీసీ ప్రైవేటీకరణకు పథక రచన చేస్తున్నారు. రూ.50 వేల కోట్ల భూములను లీజుల పేరుతో కేసీఆర్‌ కుటుంబం తీసుకుంది. గౌలిగూడలో భూములను టీఆర్‌ఎస్‌ ఎంపీ లీజుకు తీసుకున్నారు. ఆర్టీసీ భూముల లీజుల వివరాలు సంస్థ బయటపెట్టాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
సమ్మె న్యాయ సమ్మతమే
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎంతమాత్రమూ న్యాయసమ్మతం కాదని ఒకవైపు ప్రభుత్వం వాదిస్తుండగా… ఆర్టీసీ కార్మిక నేతలు ముమ్మాటికి మాది న్యాయసమ్మతమే అని స్పష్టం చేస్తున్నారు. తాము ఈ విషయంపై న్యాయ సలహా తీసుకున్నామని, సమ్మె న్యాయబద్ధమేనని సలహా చెప్పారని జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి స్పష్టం చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటనలకు భయపడేది లేదని, సమ్మె చేస్తున్న వారిలో నలుగురిని కూడా డిస్మిస్‌ చేసే పరిస్థితి లేదని అన్నారు. ఉద్యమాలతో సీఎం అయ్యి, ఉద్యమాలను అణచివేసే సీఎంగా కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే పాలేరులం కాదని, తమకు 50 వేల జీతమంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఏపీతో పోల్చి ఆర్టీసీ గురించి మాట్లాడాలని, ఇత రాష్టాల్రతో కాదని తేల్చి చెప్పారు. తమ భవిష్యత్‌ కార్యాచరణ బుధవారం ప్రకటిస్తామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.

Comments