Skip to main content

ఆర్టీసీ కార్మికులతో ముగిసిన చర్చలు

 ఆర్టీసీ కార్మికులతో ముగిసిన చర్చలు
ఆర్టీసీ కార్మికులతో ముగిసిన చర్చలు
ఆర్టీసీ చరిత్రలో ఇలాంటి నిర్బంధ చర్చలు ఎప్పుడూ చూడలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. తొలి విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయని, మళ్లీ ఎప్పుడు చర్చలకు పిలిస్తే అప్పుడు హాజరవుతామని చెప్పారు. అన్ని అంశాలపై తాము చర్చలు జరపాలని కోరామని, కానీ కొన్ని అంశాలకు మాత్రమే వారు పరిమితమయ్యారని పేర్కొన్నారు. ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ కార్యాలయంలో ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన చర్చలు ముగిశాయి. చర్చల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు, కార్మికుల తరఫున ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి, మరో ముగ్గురు కో-కన్వీనర్లు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇవి నిర్బంధ చర్చలు. మా సెల్ ఫోన్లు లాక్కున్నారు. 21 అంశాలపై మాట్లాడుతామని యాజమాన్యం అంది. మేం 26 అంశాలపై చర్చలను జరపాలని కోరాం. 21 అంశాలు ఆర్థిక అంశాలకు సంబంధం లేదని కోర్టు చెప్పింది. యాజమాన్యం ఒక ఎజెండా ఫిక్స్ చేసుకుని మాట్లాడింది. అన్ని అంశాలపై చర్చలు జరపాలని కోరాం. మా వాళ్లతో లోపల జరిగిన అంశాలపై చర్చిస్తాం. మళ్లీ చర్చలు జరిపితే సిద్ధంగా ఉన్నాం’’ అని అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మె యథావిధిగా కొనసాగుతుందని జేఏసీ కో-కన్వీనర్‌ రాజిరెడ్డి పేర్కొన్నారు. కోర్టు కోసమే చర్చలు జరిపినట్లు ఉందని ఆరోపించారు. శత్రు దేశాలతో కూడా ఇటువంటి చర్చలు ఎప్పుడూ జరగలేదని మరో కన్వీనర్‌ వీఎస్‌ రావు అన్నారు. జేఏసీ నేతలే చర్చలకు సహకరించలేదనేలా వ్యవహరించారని విమర్శించారు.

Comments