Skip to main content

ఆర్టీసీ సమ్మె మరింత ఉద్ధృతం...కండక్టర్‌ ఆత్మహత్య






ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మరింత ఉద్ధృతమవుతోంది. శనివారం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడిచిన కొద్ది గంటల్లోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాణిగంజ్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సురేందర్ గౌడ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమ్మెకు జ్వరం కారణంగా వారం రోజులు సెలవులో ఉన్న సురేందర్.. గత నాలుగు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం విషయం తెలిసి తీవ్రంగా కలతచెందారు.
ఏడాది కిందట కుమార్తెకు వివాహం చేసిన సురేందర్‌గౌడ్.. ఇందుకు స్టేట్ బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు రుణం తీసుకున్నాడు. ప్రతినెల వచ్చిన జీతంతో వాయిదాలు చెల్లిస్తుండగా, సెప్టెంబరు మాసం వేతనం ప్రభుత్వం చెల్లించకపోవడంతో చెక్కు బౌన్స్ అయ్యింది. ఈ మేరకు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చిందని, రుణం ఎలా తీర్చాలనే ఆందోళనకు గురైనట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సురేందర్‌గౌడ్‌ ఉద్యోగం పోయింది. దీంతో మనస్తాపం చెందిన సురేందర్‌గౌడ్‌ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మెదక్ జిల్లా నర్సంపేటలో ఒక డ్రైవర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. తోటి కార్మికులు, పోలీసులు ఆయనను నిలువరించారు. శ్రీనివాసరెడ్డి మరణంతో ఖమ్మం రీజియన్‌లో ఒక్క బస్సూ తిరగలేదు. సమ్మె చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇచ్చే వరకు తాము కూడా జీతాలు తీసుకోవద్దని నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్లలోని ఆర్టీసీ అధికారులు, భద్రత సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు.
వారి నిర్ణయంపై ఆర్టీసీ ఐకాస హర్షం వ్యక్తం చేసింది. తమకు గొప్ప మద్దతు ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపింది. సమ్మెకు పలు రెవెన్యూ సంఘాలూ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆదివారం ఏపీఎస్‌ ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని డిపోల వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.