Skip to main content

హానీ ట్రాప్ ఉచ్చులో పడి లక్షలు సమర్పించుకున్న విశాఖ వాసులు




కిలాడి గ్యాంగ్ విసిరిన హానీ ట్రాప్ ఉచ్చులో పలువురు విశాఖ వాసులు చిక్కుకున్నారు. వారి మాటలకు పడిపోయి లక్షలు సమర్పించుకుని, లబోదిబో మంటున్నారు. ఫేక్ డేటింగ్ సైట్లతో కిలాడి గ్యాంగ్ జనాలను ట్రాప్ చేస్తోంది. కోల్ కతా కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది బలవుతున్నారు. అందమైన అమ్మాయిన ఫొటోలను పెట్టి, పలు ఆకర్షనీయమైన ఆఫర్లతో జనాలను ఈ గ్యాంగ్ ట్రాప్ చేస్తోంది. గ్యాంగ్ కు చెందిన అమ్మాయిలు తీయని మాటలతో కస్టమర్లను ఆకట్టుకుని, వారి జేబులను గుల్ల చేస్తున్నారు. ఓస్లాం ఐటీ ముసుగులో ఈ దందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది.

విశాఖలో ఒకరి నుంచి రూ. 18 లక్షలు, మరొకరి నుంచి రూ. 3 లక్షలను ఈ గ్యాంగ్ కాజేసింది. ఇంకా బయటపడని బాధితులు చాలా మందే ఉంటారని అనుమానం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. తీగ లాగితే కోల్ కతాలో డొంక కదిలింది. దీంతో కోల్ కతాకు వెళ్లిన విశాఖ పోలీసులు... అక్కడున్న 24 మంది టెలికాలర్లతో సహా 27 మందిని అరెస్ట్ చేశారు. 3 ల్యాప్ టాప్ లు, 40 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు వీరిని కోల్ కతా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పీటీ వారెంట్ కు కోర్టు అనుమతిస్తే... వారందరినీ విశాఖకు తీసుకొచ్చి లోతుగా దర్యాప్తు చేయనున్నారు.   

Comments