Skip to main content

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది.

అక్టోబర్‌ 25, 2018 : గురువారం మధ్యాహ్నం
♦ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒకింత సమయం ఉండటంతో వీఐపీ లాంజ్‌లో వైఎస్సార్‌ సీపీ నేతలతో భేటీ అయ్యారు.
♦ అధినేతకు కాఫీ తెచ్చేందుకు పార్టీ నేతలు యత్నించగా... బయటి నుంచి తీసుకువచ్చేందుకు అనుమతి లేదని అధికారులు ఖరాకండిగా చెప్పడంతో పక్కనే ఉన్న టీడీపీ నేత హర్షవర్ధన్‌ చౌదరికి చెందిన ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ నుంచి కాఫీ ఆర్డర్‌ చేశారు.
♦ కాఫీ తెచ్చే సాకుతో రెస్టారెంట్‌లో కుక్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు వచ్చి.. ప్రతిపక్ష నేత జగన్‌పై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.


అక్టోబర్‌ 11, 2019 : శుక్రవారం రాత్రి
♦ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒకింత సమయం ఉండటంతో వీఐపీ బ్లాక్‌లోనే టీడీపీ నేతలతో భేటీ అయ్యారు.
♦ నలుగురైదుగురు నేతలు కాదు.. ఏకంగా 30 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీఐపీ లాంజ్‌లో నానాయాగీ చేశారు.
♦ బిర్యానీలు, నాన్‌ వెజ్‌ వంటకాలతో అక్కడే విందు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా.. ఎయిర్‌పోర్ట్‌లోని వీఐపీ లాంజ్‌ అన్న కనీస స్పృహ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించి అక్కడ అపరిశుభ్ర వాతావరణం కల్పించారు.
♦ నాడు కనీసం కప్పు కాఫీ కూడా బయట నుంచి తెచ్చేందుకు అనుమతివ్వని ఎయిర్‌పోర్ట్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌వో) వేణుగోపాల్‌ ఇప్పుడు యథేచ్ఛగా బిర్యానీ పొట్లాలకు, నాన్‌వెజ్‌ వంటకాలకు అనుమతిచ్చారు.

ఈ రెండు ఘటనలు ఒక్కసారి పరిశీలిస్తే ఏమర్ధమవుతుంది.. ఎయిర్‌పోర్ట్‌ అధికారుల పక్షపాతం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించడంతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల బరితెగింపు, నిబంధనలను లెక్కచేయని విచ్చలవిడితనం స్పష్టమవుతోంది.


విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నానా యాగీ చేసిన ఘటన ఇప్పుడు అధికార, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. రక్షణశాఖ ఆధీనంలోని తూర్పు నావికాదళ పర్యవేక్షణలో ఉన్న విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌(రిజర్వ్‌ లాంజ్‌)లో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్తున్న సందర్భంగా ఆ పార్టీ నేతలు నిబంధనలను పక్కనపెట్టి చేసిన హంగామా వివాదాస్పదమవుతోంది. నిబంధనల మేరకు వీఐపీ లాంజ్‌లో ప్రతిపక్షనేత లేదా స్టేట్, సెంట్రల్‌ క్యాబినెట్‌ హోదా కలిగిన నేతలు వచ్చినప్పుడు కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తారు. ఆ సందర్భంలో టీ, స్నాక్స్‌కు మాత్రమే అనుమతిస్తారు. ఒకవేళ వీఐపీ.. భోజ నం, అల్పాహారం తీసుకోవాలనుకుంటే ప్రొటోకాల్‌ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తారు. కేవలం వీఐపీకి మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన వాళ్లు, వీఐపీ సహాయకులు సైతం పక్కనే ఉన్న రెస్టారెంట్‌లోకి వెళ్లాల్సిందే. ఎవరొచ్చినా ఈ మేరకే నిబంధనలు వర్తింపజేస్తారు. బాబొస్తే నిబంధనలు బలాదూర్‌ టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో మాత్రం నిబంధనలను పక్కనపెట్టేశారు. విశాఖలో రెండురోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వెళ్లేందుకు ఈనెల 11వ తేదీన శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో చంద్రబాబు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు, స్పైస్‌ జెట్‌ విమానం బయలుదేరేందుకు సమయం ఉండటంతో వీఐపీ లాంజ్‌లో బస చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ సందర్భంగా టీడీపీ నేతలు చేసిన నానాయాగీ ఇప్పుడు సంబంధిత శాఖల అధికారుల మెడకు చుట్టుకుంటోంది. చంద్రబాబు అల్పాహారం మాత్రమే తీసుకున్నప్పటికీ ఆయనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరు చర్చకు తెరలేపింది. నిబంధనల మేరకు చంద్రబాబు ఒక్కరే వీఐపీ లాంజ్‌లో అల్పాహారం తీసుకోవాలి. కానీ ఆ రోజు దాదాపు 30 మంది వరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పక్కనే ఉన్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ నుంచి బిర్యానీలు, నాన్‌వెజ్‌ కర్రీలు ఆర్డర్లు తెచ్చుకుని హల్‌చల్‌ చేసేశారు. రెస్టారెంట్‌లోకి వెళ్లి తింటే ఎవరికీ అభ్యంతరాలుండేవి కావు.. ప్రొటోకాల్‌ అధికారులు కూడా ఆ రెస్టారెంట్‌కే వెళ్లాలని సూచించారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు లెక్కచేయలేదు. మమ్మల్ని ఎవరు అడుగుతారంటూ.. ఇక్కడికే ఫుడ్‌ తీసుకురావాలని ఆర్డర్‌ చేశారు. దీంతో పక్కనే ఉన్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్‌ చౌదరి హడావుడికి అంతులేకుండా పోయింది. అక్కడే చంద్రబాబుకు పొర్లు దండాలు పెట్టిన హర్షవర్ధన్‌ టీడీపీ నేతలకు ఏది కావాలన్నా దగ్గరుండి సర్వీస్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తతంగాన్ని అడ్డుకోవాల్సిన ఎయిర్‌పోర్ట్‌ చీఫ్‌ సెక్యూరిటీ అధికారి(సీఎస్‌వో) వేణుగోపాల్‌ టీడీపీ నేతలకు మరింత ఊతమిచ్చేలా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారన్న వాదనలున్నాయి. నిబంధనలన్నీ వైఎస్సార్‌సీపీ నేతలకేనా.. ఇక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినప్పుడు కలిసేందుకు వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలను కూడా నిలవరిస్తూ అడ్డంకులు సృష్టిస్తున్న అధికారులు చంద్రబాబు, టీడీపీ నేతల విషయంలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఎలా అనుమతిచ్చారని వంశీకృష్ణ శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ఇంతకూ ఆ బిల్లు ఎవరివ్వాలి... టీడీపీ నేతలు వీఐపీ లాంజ్‌లో నానాయాగీ చేసి వెళ్ళిపోయారు సరే.. ఇప్పుడు ఆ బిల్లు ఎవరివ్వాలన్నది సంశయంలో పడింది. లెక్కకు మించిన టీడీపీ నాయకులు లెక్క లేకుండా చేసిన ఖర్చును ఎవరు భరిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. శుక్రవారం బాబు అండ్‌ కో చేసిన ఖర్చు ఇవ్వాలని రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి అధికారులను కోరగా, అధికారులు మాత్రం ఆ బిల్లు తాము ఇవ్వలేమని చెబుతున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్‌బాబులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినప్పుడు ఖర్చు చేసిన బిల్లులే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అప్పట్లో లోకేష్‌ అండ్‌ కో తినుబండారాలకు లక్షల్లో బిల్లులట ఇక తాజా వివాదంతో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ బాబు గతంలో ఎయిర్‌పోర్ట్‌కు విచ్చేసినప్పుడు చేసిన ఖర్చులు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. కేవలం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే లోకేష్‌ బాబు అండ్‌ కో తినుబండారాల ఖర్చు లక్షల్లో ఉందని అధికారులు చెప్పుకొస్తున్నారు. 2017 నుంచి 2019 మార్చి వరకు చంద్రబాబు, లోకేష్‌బాబుల విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తినుబండారాల ఖర్చు సుమారు రూ.14లక్షల మేర బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. 2017 వరకు వారిద్దరి తినుబండారాల ఖర్చు దాదాపు రూ.12లక్షల వరకు అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌కు చెల్లించారంటే ఏ మేరకు ఖర్చు చేశారో అర్ధం చేసుకోవచ్చు. ఇన్నేసి రూ.లక్షలు నొవోటెల్‌లో బసకు అనుకున్నారేమో కాదు.. కేవలం ఎయిర్‌పోర్ట్‌లో రిఫ్రెష్‌మెంట్‌ కింద చేసిన ఖర్చు మాత్రమే. లోకేష్‌బాబు చెకోడీలు,చాక్లెట్లకే అన్ని లక్షలా : వంశీకృష్ణ లోకేష్‌బాబు తినుబండారాలు చెకోడీలు, చాక్లెట్లకే అని లక్షలు ఖర్చు చేశారా... అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో జరిగిన దుర్వినియోగానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ఎయిర్‌పోర్ట్‌కు విచ్చేసిన సందర్భాల్లో సర్వ్‌ చేసే టీ స్నాక్స్‌ పేరిటే అన్ని లక్షలు ఎలా మింగారో అని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఆ ఖర్చులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ రోజు విచారణ చేస్తా... ఆ రోజు ఏం జరిగిందో పూర్తిస్థాయిలో సోమవారం విచారణ చేస్తా.. నిబంధనల మేరకు వీఐపీ లాంజ్‌లో ఎవరికీ సర్వ్‌ చేయకూడదు. అత్రికమించి ఎవరు చేసినా చర్యలు తీసుకుంటా... అని విశాఖ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ రాజా కిషోర్‌ స్పష్టం చేశారు.

Comments