Skip to main content
బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం?
. బంగారమంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. మన దేశంలో పసిడి ప్రియులు ఎక్కువే.
అయితే ఇటీవల నల్లధనాన్ని పసిడి రూపంలో దాచుకుంటున్న నేపథ్యంలో ఆ బంగారాన్ని
బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకాన్ని
తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత పరిమాణానికి
మించి బంగారం ఉంటే తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
నల్లధనాన్ని
బంగారం రూపంలో దాచుకునేవారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు
చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆదాయపు పన్ను ఆమ్నెస్టీ తరహాలో
బంగారం కోసం ప్రత్యేక పన్నుమాఫీ పథకాన్ని తీసుకురానున్నట్లు అధికారిక
వర్గాలు తెలిపాయి. ఈ పథకం కింద వ్యక్తులు వద్ద నిర్ణీత పరిమితికి మించి
ఉన్న బంగారాన్ని వెల్లడించి దానిపై పన్నులు చెల్లించే అవకాశం
కల్పిస్తారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఆ పన్ను రేటు ఎంత
ఉంటుంది..? పరిమితులకు సంబంధించిన ఇతర నిబంధనలను ఇంకా నిర్ణయించలేదని
తెలిపాయి. వ్యక్తి లేదా కుటుంబం వద్ద పరిమితికి మించి బంగారం ఉంటే అది ఎంత
మొత్తంలో ఉందో, మార్కెట్ ప్రకారం ఎంత విలువ ఉందో ఎప్పటికప్పుడు
ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రశీదు లేకుండా కొనుగోలు
చేసిన బంగారంపైనా పన్ను విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ
క్షమాభిక్ష పథకం నిర్దిష్ట కాలపరిమితిలో మాత్రమే వర్తించనున్నట్లు సదరు
వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత బంగారం నిర్ణీత
పరిమితికి మించి దొరికితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందట! అయితే
పెళ్లైన మహిళల వద్ద ఉన్న బంగారానికి ఇప్పటికే ఉన్న పరిమితికి మించి మరికొంత
మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక
వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా ఈ పథకాన్ని
రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ ప్రతిపాదనను
కేంద్ర కేబినెట్ ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి అక్టోబరు 2వ
వారంలో దీనిపై చర్చించాల్సి ఉండగా.. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల దృష్ట్యా
వాయిదా వేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక దేవాలయాల్లోని బంగారాన్ని
ఉత్పాదక పెట్టుబడిగా మలిచేందుకు మరో ప్రకటన ఇవ్వాలని కూడా కేంద్రం
యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
దేశంలో
నల్లధనం నిర్మూలించేందుకు 2016లో రూ.1000, రూ.500నోట్లను రద్దు చేసిన
విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి కొందరు పెద్దమొత్తంలో నల్ల
ధనాన్ని పసిడిలో పెట్టుబడి పెడుతున్నారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ
నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక
సమాచారం వెలువడలేదు.
Comments
Post a Comment