హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో... బీజేపీ, కాంగ్రెస్ లు ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. 10 సీట్లను గెల్చుకున్న జేజేపీ అధినేత దుష్యంత్ కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి మద్దతిచ్చే ఆలోచన తమకు లేదని చెప్పారు. ఈ పరిణామాలను ముందే ఊహించిన బీజేపీ అధిష్ఠానం ఇండిపెండెంట్లను ఆకర్షించే ప్రయత్నంలో బిజీగా ఉంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి స్వతంత్ర అభ్యర్థులు మద్దతు తెలిపితే... వారిని జనాలు చెప్పుతో కొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జతకలిసే ఇండిపెండెంట్లు వారి గొయ్యి వారే తవ్వుకున్నట్టని చెప్పారు. అలా చేసే ఇండిపెండెంట్లను ప్రజలు క్షమించరని... సరైన సమయంలో చెప్పులతో సమాధానం చెబుతారని అన్నారు.
Comments
Post a Comment