టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం ఖాయమనే చెప్పుకుంటున్నారు. దీపావళి తర్వాత ఈ విషయంలో క్లారిటీ ఇస్తానని వంశీ ఇప్పటికే చెప్పారు. వంశీకి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు, వంశీ రాక గన్నవరం నియోజకవర్గం వైసీపీలో అలజడి సృష్టిస్తోంది. గత ఎన్నికల్లో వంశీ చేతిలో ఓటమిపాలైన వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన రాకను నిరసిస్తూ పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వెంకట్రావు ఇంటికి చేరుకుంటున్నారు. వంశీ వైసీపీలో చేరితే... యార్లగడ్డ భవితవ్యం ఏమిటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment