పోలీసులపై నమ్మకాన్ని కలిగించడానికి ‘‘విజిట్ పోలీస్ స్టేషన్’’ పోగ్రాం, ఏపీలో వారం రోజుల పాటు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు, ఫేక్ న్యూస్ ట్రోల్ చేస్తే కఠిన చర్యలు తప్పవు, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడి
Vijayawada, October 15: పోలీసులంటే ప్రజల్లో ఓ రకమైన అపోహలు ఉన్నాయని, వీటిని తొలగించేందుకు సరికొత్తగా కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇందులో భాగంగా ‘విజిట్ పోలీస్ స్టేషన్’ అనే కార్యక్రమం మొదలుపెడుతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ సంధర్భంగా వారం రోజుల పాటు పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు. ఈ వారోత్సవాల్లో ప్రధానంగా అసలు పోలీసులు అంటే ఏమిటీ, వారి విధి నిర్వహణ ఎలా ఉంటుంది అనేది అందరూ తెలుసుకోవాలని, ఆ విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అలాగే ఈ వారోత్సవాల్లో మొదటి రోజున పిల్లలకు పెయింటింగ్, కార్టూన్ పోటీలు.. రెండవరోజున పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. మూడో రోజున పోలీసు కుటుంబాల పిల్లలకు వికాస కార్యక్రమాలు, నాల్గవ రోజున విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి మార్తన్, పోలీసు విధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు గౌతం నవాంగ్ తెలిపారు.
అయిదవరోజున విద్యాసంస్ధల్లో శాంతి భద్రతలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, ఆరవ రోజున మెడికల్‌క్యాంపు, అమరవీరుల కుటుంబాలతో కలయిక ,ఇక చివరగా ఏడో రోజున ఏఆర్ గ్రౌండ్స్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాటు చేస్తున్నామనని ఏపీ డీజీపీ తెలిపారు.
ఈ సంధర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వస్తున్న ఆరోపణలపై మాట్లాడుతూ.. అవన్నీ నిజం కావని కేసు విచారణ సమర్థవంతంగా సాగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు తాము పట్టించుకోమని, పోలీస్ వాళ్లు తామ పని తాము చేసుకుంటు పోతారని అన్నారు. రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావం తగ్గిందని, ప్రజలు మీద కూడా వీరి ప్రభావం చాలా మేరకు తగ్గిందని తెలిపారు. ప్రజాస్వమ్యం ద్వారా మాత్రమే మార్పు వస్తుందని, హింస ద్వారా ప్రజాస్వామ్యం రాదని పేర్కొన్నారు. మావోయిస్ట్ అరుణ పోలీసుల దగ్గర ఉన్నారనే అసత్య ప్రచారం చేస్తున్నారని, పోలీస్ అదుపులో ఏ మావోయిస్టు లేరని డీజీపీ స్పష్టం చేశారు.
Comments
Post a Comment