Skip to main content

ఆదిత్య థాకరే గెలుపు ఖాయం: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై ‘వర్లీ’ నియోజకవర్గం నుంచి శివసేన తరఫున బరిలోకి దిగుతున్న దివంగత బాల్ థాకరే మనవడు ఆదిత్య థాకరేకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. శివసేన పార్టీ యువ విభాగమైన ‘యువసేన’ చీఫ్  29 ఏళ్ల  ఆదిత్య థాకరే భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని సంజయ్ దత్ పేర్కొన్నారు.

అదిత్య థాకరే శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే పెద్ద కుమారుడు.  ‘ఆదిత్య నాకు చిన్న తమ్ముడు లాంటి వాడు. అతను ఉద్దండ నేత బాలసాహెబ్ థాకరే వంశం నుంచి వస్తున్నాడు. బాలాసాహెబ్ నాకు తండ్రి లాంటి వారు. అతను నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించారు. ఆయన్ని నేను ఎప్పటికీ మరిచిపోను. ఉద్దవ్ బాయ్ కూడా అంతే ప్రేమతో మమ్మల్ని అభిమానిస్తాడు’ అని 60 ఏళ్ల సంజయ్ పేర్కొన్నాడు.

  ‘ఆదిత్య గెలవాలని నేను కోరుకుంటున్నా. అదే జరుగుతుంది.  మనదేశానికి ధైర్యమున్న యువ నేతల అవసరముంది. జై హింద్, జై మహారాష్ట్ర’  అని సంజయ్ ట్వీట్ చేశారు.

తొలిసారిగా థాకరే కుటుంబం నుంచి..
1966 లో బాల్ థాకరే శివసేన స్థాపించిన నాటినుంచి ఇప్పటివరకు ఆ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎన్నికల బరిలోకి దిగలేదు. రాజ్యాంగ బద్ధమైన పదవులను అధిష్ఠించలేదు. ఉద్దవ్ థాకరే కజిన్ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ ఎస్) చీఫ్ రాజ్ థాకరే 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేస్తానని తొలుత ప్రకటించి అనంతరం విరమించుకున్నారు.

Comments