ఎన్నికల ముందు హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి వ్యవహారంపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. తన బాబాయిని చంపింది ఎవరో జగన్ కు తెలుసని, కానీ ఆయన వాళ్ల పేర్లను దాచిపెడుతున్నారని ఆరోపించారు. కేసు విచారణ కీలకదశలో ఉన్న తరుణంలో కడప ఎస్పీని బదిలీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. హంతకులు ఎవరన్నది ఎస్పీకి తెలుసని, అందుకే ఆయనను బదిలీపై పంపించి వేశారని తెలిపారు. ఎన్నికల ముందు విపక్షంలో ఉన్న జగన్ ఆ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment