Skip to main content

ప్రమాణ స్వీకారం వేళ హర్యానాలో బీజేపీకి షాక్‌.. ఆ పార్టీకి మద్దతివ్వమన్న దుష్యంత్‌!



హర్యానాలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో కింగ్‌ మేకర్‌గా మారిన జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) మద్దతుపై కోటి ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ అధినేత దుష్యంత్‌ చౌతాలా భారీ షాక్‌ ఇచ్చారు. బీజేపీకి మద్దతు ఇచ్చే ఆలోచనే తమకు లేదని స్పష్టం చేశారు.

ఈ రోజు ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఫలితాలు వెలువడిన అనంతరం మా ఎమ్మెల్యేలంతా సమావేశం అయ్యాం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించాం. మేము ఓ సిద్ధాంతం ప్రకారం పార్టీని స్థాపించాం. అదే సిద్ధాంతాన్ని కొనసాగిస్తాం’ అని దుష్యంత్‌ స్పష్టం చేశారు. ఫలితాల అనంతరం బీజేపీ అధినాయకులు ఎవరూ తమను సంప్రదించలేదని, తాను కూడా ఎవరితోనూ మాట్లాడలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 46 కాగా బీజేపీ 40 మార్కువద్ద ఆగిపోయింది. కాంగ్రెస్‌కు 31, జేజేపీకి 10, ఇతరులు 9 స్థానాల్లో గెలుపొందారు. అతిపెద్ద పార్టీగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయింది. ఈరోజు ఖట్టర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి.

మరోపక్క, బేరసారాలపై ఆశలు పెట్టుకునే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఇండిపెండెంట్లను తనవైపు తిప్పుకుందని, వారు ఢిల్లీ చేరుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు జేజేపీ బేషరతుగా మద్దతు ఇస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. ఈ పరిస్థితుల్లో దుష్యంత్‌ ప్రకటన ఆ పార్టీకి కాస్త షాక్‌ అనే చెప్పాలి.

Comments