Skip to main content

సమ్మె కాదు..ఆర్టీసీనే ముగుస్తుంది: కేసీఆర్‌

సమ్మె కాదు..ఆర్టీసీనే ముగుస్తుంది: కేసీఆర్‌ రాష్ట్రంలో సమ్మెతో ఆర్టీసీ కార్మికులు దురహంకార పద్ధతిని అవలంబించారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కార్మికుల వేతనాలు నాలుగేళ్లలోపు 67 శాతం పెంచామని.. దేశంలో ఎక్కడైనా ఇలా పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. కార్మికులు ఇంకా గొంతెమ్మ కోర్కెలు కోరడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విలీనం అసంబద్ధమైన నినాదం
‘‘ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎవరు పడితే వారు కోరితే కలుపుతారా? ఎవర్ని మోసం చేయాలని? రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో 57 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత వారు కూడా విలీనం చేయాలని కోరితే ఏం చేయాలి? ప్రభుత్వానికి ఓ పద్ధతి, విధానం ఉంటుంది. ఆర్టీసీని విలీనం చేశారు.. వీరిని ఎందుకు చేయరని ఇవే కోర్టులు మళ్లీ ఆదేశాలు జారీ చేస్తాయి. అప్పుడేం సమాధానం చెప్పాలి? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అసంబద్ధమైన, అర్థరహితమైన, తెలివి తక్కువ నినాదం. కార్మికులు చేస్తున్న సమ్మెలో ఔచిత్యం లేదు. ఆర్టీసీ సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగుస్తుంది. ఆర్టీసీ ముగిసిపోయింది.. ఇట్స్‌ గాన్‌ కేస్‌. సమ్మెతో వెయ్యి శాతం పాత ఆర్టీసీ ఉండే అవకాశం లేదు’’ అని కేసీఆర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.
సమ్మె కాదు..ఆర్టీసీనే ముగుస్తుంది: కేసీఆర్‌
ఆర్టీసీ మునగక తప్పదు.. ఎవరూ కాపాడలేరు
‘‘ఆర్టీసీలో లాభాలు తెస్తున్న అద్దె బస్సులు వద్దని డిమాండ్‌ చేస్తారా? మనం స్వీకరించే వృత్తి ఏంటి? మన బాధ్యత ఏంటి? అనేది తెలుసుకోవాలి. ఆర్టీసీ కార్మికులకు సగటున రూ.50వేల జీతం వస్తోంది. సంస్థ మీది.. కాపాడుకోవాలనే బాధ్యత మీకు లేదా? సందర్భానుసారం పనిచేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఆర్టీసీ మునగక తప్పదు.. ఎవరూ కాపాడలేదు. రాష్ట్రం ఏర్పడక ముందు ఆర్టీసీకి ఇచ్చిన నిధులు రూ.712కోట్లు. తెరాస అధికారంలోకి వచ్చాక రూ.4,250 కోట్లు విడుదల చేశాం. ఆర్టీసీకి ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.550కోట్లు కేటాయించాం. ఇప్పటికే రూ.425 కోట్లు విడుదల చేశాం. అదనపు ఆదాయం వచ్చే సమయంలో సమ్మెకు వెళ్లారు. సమ్మెపై మొదట స్పందించాం.. కమిటీ వేశాం. నోటీసు ఇవ్వగానే సముదాయించే ప్రయత్నం చేశాం. సమ్మెకు వెళ్తామనగానే కమిటీ వేసి చర్చలు జరిపాం’’ అని కేసీఆర్‌ వివరించారు.
సమ్మె కాదు..ఆర్టీసీనే ముగుస్తుంది: కేసీఆర్‌
యూనియన్లే కార్మికుల గొంతు కోస్తున్నాయ్‌!
‘‘ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికలకు ముందు జరిగే హడావుడే ఈ సమ్మెకు ప్రధాన కారణం. సమ్మె ముసుగులో యూనియన్లే అమాయక కార్మికుల గొంతు కోస్తున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లతో నాకు పంచాయితీ లేదు. యూనియన్లు లేకుండా ఆర్టీసీ కార్మికులు పనిచేస్తే రెండేళ్లలో రూ.లక్ష బోనస్‌ తీసుకుంటారు. తెలంగాణ కోసం ఆర్టీసీ వాళ్లే కాదు.. అందరూ పనిచేశారు. నా ఇంట్లో ఉన్నవాళ్లు దొంగతనం చేస్తే దొంగతనం కాకుండా పోతుందా?. భూగోళం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదు. ఆర్టీసీకి పోటీ ఉండాలని ప్రధాని మోదీయే చట్టాన్ని తీసుకొచ్చారు. సెప్టెంబర్‌ 1 నుంచి మోటారు వాహనాల సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఆరాచక వ్యవస్థను ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తున్నాయి. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయమనండి’’ అని ధ్వజమెత్తారు.
ఏపీలో ఆర్డర్‌ మాత్రమే ఇచ్చారు
‘‘ఏపీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సీఎం జగన్‌ సంగతే చెబుతున్నా. ఏపీలో విలీనంపై ఆర్డర్‌ మాత్రమే ఇచ్చారు.. కమిటీ వేశారు. ఏం జరుగుతుందనేది  మూడు నెలలకో.. ఆరునెలలకో తెలుస్తుంది. ఆ కమిటీ ఏం చెబుతుందో ఎవరికీ తెలియదు’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 

Comments