Skip to main content

ఎయిర్‌ ఇండియాలో పైలట్ల రాజీనామాలు!

 
ఎయిర్‌ ఇండియాలో పైలట్ల రాజీనామాలు!
ఎయిర్ ఇండియాలో కొందరు పైలట్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. వేతనం, పదోన్నతుల విషయంలో పైలట్లు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. వేతనం, పదోన్నతుల విషయంలో వారి డిమాండ్లను సంస్థ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో దాదాపు 120 మంది ఎయిర్‌బస్‌ ఏ-320 విమానాల పైలట్లు వారి రాజీనామా పత్రాలను దాఖలు చేశారు. రాజీనామా చేసిన ఒక ఉద్యోగి మీడియాతో మాట్లాడుతూ.. ‘వేతనాల పెంపు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఇందుకు సంబంధించి మేము చేసిన డిమాండ్లపై సంస్థ కచ్చితమైన హామీ ఇవ్వడంలో విఫలమైంది. అంతేకాకుండా మేము మా వేతనాల్ని సరైన సమయంలో పొందలేకపోతున్నాం. పైలట్లు మొదట ఐదు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన తక్కువ వేతనానికి ఉద్యోగంలో చేరారు. అలాంటి వారు ఇప్పుడు వేతనం పెరుగుతుందని ఎన్నో ఆశలతో ఉన్నారు. అనుభవం పొందినా అందుకు తగ్గ వేతనం అందడం లేదు’ అని అన్నారు. 
ప్రస్తుతం మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. పైలట్లు తమకు ఇక్కడ కాకపోయినా మరో సంస్థలో ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో, గో ఎయిర్‌, విస్తారా, ఎయిర్‌ ఏసియా తదితర సంస్థలు కూడా ఏ-320 విమానాలు నడుపుతున్నట్లు సమాచారం. దీనిపై ఎయిర్‌ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. పైలట్ల రాజీనామాలతో సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లదు అని తెలిపారు.  ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాలో మొత్తం 2వేల పైలట్లు ఉన్నట్టు సమాచారం.

Comments