Skip to main content

దటీజ్‌ ధర్మాడి సత్యం

 రాయల్‌ వశిష్ఠ వెలికితీతలో ఆయనదే కీలకపాత్ర
దటీజ్‌ ధర్మాడి సత్యం



ఉన్నత చదువులు చదవలేదు.. సాంకేతికతపై పెద్దగా పట్టు లేదు. అయినా సముద్రం, నదిలో మునిగిపోయిన పడవలు.. బోట్లను వెలికితీయడంలో మాత్రం అతని అనుభవం అపారం. ఆయనే తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం. ఎక్కడైనా మునిగిపోయిన బోటును వెలికితీయాలంటే ఆ జిల్లా వాసులకు తొలుత గుర్తొచ్చే పేరు ఆయనదే. ధర్మాడి బృందం అడుగుపెట్టిందంటే ఆపరేషన్‌ సక్సెస్‌ కావాల్సిందే. కచ్చులూరు వద్ద  గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటును వెలికితీయడంతో ధర్మాడి సత్యం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.
సెప్టెంబర్‌ 15న రాయల్‌ వశిష్ఠ బోటు గోదావరిలో మునిగిపోయిన సమయంలో ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఆ క్రమంలో బోటును వెలికితీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఉత్తరాఖండ్‌కు చెందిన విపత్తు నిర్వహణ బృందాలు కొన్ని రోజుల పాటు సహాయక చర్యలు చేపట్టినా ఆ తర్వాత చేతులెత్తేశాయి. డెహ్రాడూన్‌ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన ప్రత్యేక అధికారి వచ్చినా ఫలితం లేకపోయింది. అప్పటికి ఇంకా 13 మంది ఆచూకీ తెలియకపోవడంతో వారి బంధువుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రభుత్వం బోటు వెలికితీసే బాధ్యతను కాకినాడ వాసి ధర్మాడి సత్యంకు చెందిన బాలాజీ మెరైన్‌ సంస్థకు అప్పగిస్తూ.. రూ.22.7లక్షలకు కాంట్రాక్టు ఇచ్చింది. దీంతో ధర్మాడి బృందం రంగంలోకి దిగింది. బోటును వెలికితీయడంతో పాటుగా మృతదేహాల కోసం ఆ బృందం సెప్టెంబరు 28న అన్వేషణ మొదలు పెట్టింది. తొలుత ఐదు రోజులపాటు గాలింపు ప్రక్రియ చురుగ్గా సాగినా గోదావరికి వరద పోటెత్తడంతో అక్టోబరు 3న ఆపరేషన్‌ నిలిపివేశారు.
దటీజ్‌ ధర్మాడి సత్యం
గోదావరి శాంతించడంతో తిరిగి అక్టోబరు 16న మరోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. ఐరన్‌ రోప్‌, లంగర్ల సాయంతో బోటు మునిగిన ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లంగరుకు చిక్కుకుని విడిభాగాలు బయటికొచ్చినా బోటు మాత్రం బయటకు రాలేదు. కొన్ని సార్లు లంగరుకు చిక్కినట్టే  చిక్కి జారిపోయింది. అయినా ధర్మాడి సత్యం పట్టువీడలేదు. బోటు ఉన్న ప్రాంతంలో లంగరు వేసి ఐరన్‌ రోప్‌ను బోటు చుట్టూ చుట్టి పొక్లెయిన్‌తో బయటకు లాగేప్రయత్నం చేశారు... అయినా పట్టు చిక్కలేదు. ప్రయత్నాలు ఫలించక పోవడంతో చివరికి విశాఖకు చెందిన స్కూబా డైవర్లతో సంప్రదింపులు జరిపారు. డైవర్లు నదీగర్భంలో దిగేందుకు తొలుత సాహసించలేదు. దీంతో ధర్మాడి స్వయంగా విశాఖ వెళ్లి వారితో మాట్లాడి ఒప్పించారు. వారిని కచ్చులూరు తీసుకొచ్చి బోటు మునిగిన ప్రదేశంపై పూర్తి అవగాహన కల్పించారు. బోటు ఎలా బయటకు తీయాలనుకుంటున్నది డైవర్లకు వివరించారు. ధర్మాడి వ్యూహం మేరకు డైవర్లు నదీ గర్భంలోకి దిగి ఐరన్‌ రోప్‌ను బోటు ఫ్యాన్‌కు కట్టారు. నది ఒడ్డున ఏర్పాటు చేసిన పొక్లెయిన్‌కు ఐరన్‌రోప్‌ కట్టి మెల్లగా లాగడంతో ఐరన్‌ రోప్‌ ఫ్యాన్‌కు గట్టిగా బిగుసుకుంది. అలా పొక్లెయిన్‌తో బయటకు లాగి.. 38 రోజులుగా నదీగర్భంలో ఉన్న బోటును ఒడ్డుకు చేర్చగలిగారు.
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈరోజుల్లో మెరైన్‌, నేవీ బృందాలు కూడా చేయలేని పనిని ధర్మాడి సత్యం బృందం చేసిందని పలువురు అభినందిస్తున్నారు. నదీగర్భంలో బోటు.. అందులో మృతదేహాలు ఉండటంతో ఆ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లేందుకు భయపడ్డామని కచ్చులూరు, సమీప గ్రామాల మత్స్యకారులు చెప్పారు. బోటు బయటకు తీయడంతో ఆ ప్రాంతానికి యథావిధిగా చేపల వేటకు వెళ్తామని హర్షం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా.. బోటులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసుకొచ్చి వారి దుఃఖంలో పాలుపంచుకున్నామని ధర్మాడి సత్యం తెలిపారు.
దటీజ్‌ ధర్మాడి సత్యం

Comments