టీఎస్సార్టీసీ సమ్మెలో పాల్గొన్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని
ప్రకటించిన సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన పీఆర్టీయూ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన
పాల్గొన్నారు. ఉద్యోగాలకు రాలేదని కార్మికులను తొలగిస్తానన్న సీఎం కేసీఆర్
ఆరేళ్లుగా సచివాలయానికి రావడం లేదుగా, మరి, ఆయన్ని ఏం చేయాలి? పీడీ యాక్ట్
పెట్టాలా? అని సెటైర్లు విసిరారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు
కేసీఆర్ కు ముఖం చెల్లట్లేదని, అందుకే, పత్రికా ప్రకటనలు విడుదల
చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్ధంగా
జరుగుతోందని అన్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత హరీశ్ రావు గురించి
ఆయన ప్రస్తావించారు. గతంలో ఆర్టీసీ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీశ్ ఇంత
జరుగుతున్నా నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యోగులు తమ సమస్యల
పరిష్కారం కోసం రాజకీయ పార్టీల వైపు చూడొద్దని, తాత్కాలిక ప్రయోజనాలకు
ఆశపడకుండా వారి బాధ్యతను వారు సక్రమంగా నేరవేర్చాలని సూచించారు.
Comments
Post a Comment