హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో నామినేషన్లకు గడువు ముగిసింది. ఈ క్రమంలో సీపీఐ నారాయణ వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమతో సరిగా వ్యవహరించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కలిసివచ్చే పార్టీలను సమన్వయం చేయడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలం అయ్యారని నారాయణ ఆరోపించారు. సీపీఎం నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో వారికి మద్దతు ఇవ్వలేకపోతున్నామని, ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ప్రజలను కోరతామని స్పష్టం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు సీపీఐ ముఖ్యులతో చర్చలు జరిపిన నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఐ దోస్తీ స్పష్టమైంది.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment