వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి ఈరోజు శ్రీకారం చుట్టింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభ్యున్నతి లక్ష్యంగా ‘వైఎస్సార్ నవోదయ’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలను ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
దీని ద్వారా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల రుణాలను ఒకే విడతలో రీషెడ్యూల్ చేస్తారు. ఇందుకు సంబంధించి బ్యాంకులకు ప్రభుత్వం హామీగా ఉంటుంది. ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలను గుర్తించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా ఎంఎస్‌ఎంఈల రుణ ఇబ్బందులు తీర్చేలా బ్యాంకులు సిద్ధం కావాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.
రుణాల రీ షెడ్యూల్ నాటికి పరిశ్రమలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకోవాలి. ఈ రుణాలు 2019 జనవరి నాటికి రూ.25 కోట్లు దాటి ఉండకూడదని రిజర్వ్ బ్యాంకు ఇప్పటికే నిబంధన విధించింది. కాగా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Comments
Post a Comment