Skip to main content

సైరా' సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ఏపీ ప్రభుత్వం అనుమతి

చిరంజీవి హీరోగా వస్తున్న సైరా చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. అయితే, తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎదురయ్యే రద్దీ, బ్లాక్ టికెట్ల నియంత్రణ కోసం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలని కొణిదెల ప్రొడక్షన్స్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ పట్ల ఏపీ సర్కారు సానుకూలంగా స్పందించింది. సైరా చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి మంజూరు చేసింది. వారం రోజుల పాటు సైరా ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని రాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటలవరకు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది. తద్వారా రద్దీ నియంత్రణ, బ్లాక్ టికెట్ల నియంత్రణ సులభతరం అవుతుందని ప్రభుత్వం కూడా అంగీకరించింది.

Comments