Skip to main content
అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈ
సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో జగన్ నేడు భేటీ అయ్యారు.
సుమారు 40 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి
పెండింగ్‌లో ఉన్న నిధులు, సమస్యలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేకహోదా
ఇవ్వాలంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూలోటు కింద రాష్ట్రానికి
రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలో హామీలు, వెనకబడ్డ
జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి
వరదజలాల తరలింపు తదితర అంశాలపై అమిత్‌షాతో మాట్లాడారు. పరిశ్రమలు,
సేవారంగాలపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపిందని ఆయన దృష్టికి
తీసుకెళ్లారు. కాగ్‌తో
చర్చించిన అనంతరం 2014-2015లో రెవెన్యూ లోటును సవరిస్తామని గతంలో హామీ
ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని
అమిత్‌షాను జగన్ కోరారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.22948.76 కోట్లు
రెవెన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ.. ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్రం
నుంచి రావాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
కడపలో స్టీల్‌ప్లాంట్, ప్రకాశం
జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణాల అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు
తెలుస్తోంది. వీటితోపాటు విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్,
కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన
నిధులను సమకూర్చాల్సిందిగా హోం మంత్రిని కోరారు. వెనకబడ్డ
జిల్లాలకు నిధులు కేటాయించే విధానాన్ని మార్చాలని కోరారు. ఏపీలో వెనకబడ్డ
జిల్లాల్లో ఒక్కొక్కరికి రూ.400 రూపాయల చొప్పున ఇస్తే, బుందేల్‌ఖండ్,
కలహండి ప్రాంతాలకు రూ.4000 ఇస్తున్న విషయాన్ని ఆయనకు గుర్తు చేశారు. పోలవరం
ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదించాలని
అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. ఇందులో రూ.33వేల కోట్లు భూసేకరణ, ఆర్ అండ్
ఆర్‌కే ఖర్చు అవుతుందని ఆయనకు వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో
రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా రూ.838 కోట్ల ప్రజాధానాన్ని ఆదా
చేశామని తెలిపారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి వరదజలాల తరలింపు అంశాన్ని ఆయనతో చర్చించారు.
కృష్ణా
జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, కృష్ణాడెల్టా సహా తాగునీరు, సాగునీటి కొరత ఉన్న
ప్రాంతాలకు గోదావరి వరద జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు
తరలించేందుకు వీలుగా ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖలను
ఆదేశించాలని సీఎం కోరారు. దీనివల్ల రాష్ట్రంలోని సాగునీరు, తాగునీరు కొరత
ఉన్న ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, ఆ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు
మెరుగవుతాయని హోంమంత్రికి జగన్ వివరించారు.
Comments
Post a Comment