Skip to main content

మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తర్వాత చిరు అంటూ..

మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి

 నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాతి జనరేషన్‌లో ప్రజల్ని అలరించడానికి చిరంజీవి వచ్చారని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ‘సైరా’ చిత్రానికి ప్రమోషన్స్‌లో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా ఉపరాష్ట్రపతిని దిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు నివాసంలో ‘సైరా’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిరంజీవితో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడారు. చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. అప్పట్లో రామారావు, నాగేశ్వరరావు తర్వాతి జనరేషన్‌లో చిరంజీవి వచ్చారని గుర్తుచేసుకున్నారు. సైరా మంచి చారిత్రాత్మక చిత్రమని కొనియాడారు.
మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు. ‘‘బ్రిటిష్‌ వారి అరాచకాలను ఎదిరిస్తూ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాట స్ఫూర్తితో రూపొందిన ‘సైరా’ చిత్రం బాగుంది. నటులు చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, దర్శకుడు సురేందర్‌రెడ్డికి అభినందనలు. నిర్మాత రామ్‌ చరణ్‌ తేజ్‌కు ప్రత్యేక అభినందనలు. ఊరూవాడా చూడదగిన ఉత్తమ చిత్రం ‘సైరా’. చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణాదాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, సినీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు’’ అని ట్విటర్‌లో తెలిపారు.
మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి

అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సైరా’ సినీ ప్రముఖులతోపాటు విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికాలో చిత్రం 2.5 మిలియన్‌ డాలర్లకుపైగా వసూలు చేసింది. చిరు కెరీర్‌లో అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

Comments