Skip to main content

ఒడ్డుకు చేరిన వశిష్ఠ.. బోటులోనే మృతదేహాలు

 
ఒడ్డుకు చేరిన వశిష్ఠ.. బోటులోనే మృతదేహాలు
 తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటు 38 రోజుల తర్వాత ఎట్టకేలకు ఒడ్డుకు చేరింది. ధర్మాడి సత్యం బృందం, స్కూబా డైవర్లు తీవ్రంగా శ్రమించి నదిలో నుంచి బోటును వెలికితీశారు. దుర్వాసన వస్తుండటంతో ఎవరూ బోటు వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బోటులో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఏడు మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు బయటపడుతున్నాయి.
ఒడ్డుకు చేరిన వశిష్ఠ.. బోటులోనే మృతదేహాలు
గత నెల 15న 77 మందితో పాపికొండల పర్యటనకు బయలుదేరిన వశిష్ఠ బోటు కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది మృతిచెందగా,  26 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 12 మంది ఆచూకీ తెలియలేదు. దీంతో అప్పటి నుంచి నదిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బోటును వెలికితీసే బాధ్యతను కాకినాడకు చెందిన ధర్మాడి సత్యంకు అప్పగించారు. మునిగిపోయిన బోట్లు, పడవలను వెలికితీయడంలో మంచి నైపుణ్యం ఉన్న ధర్మాడి సత్యం.. తన బృందంతో గత కొన్నిరోజులుగా బోటును వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో విశాఖ నుంచి స్కూబా డైవర్లను తీసుకొచ్చారు. వారు నదీగర్భంలోకి వెళ్లి ఇసుకులో కూరుకుపోయిన బోటుకు లంగర్లు, ఐరన్‌ రోప్‌ కట్టడంతో అతికష్టం మీద పొక్లెయిన్‌తో బయటకు లాగారు. గత 38 రోజులుగా నదీ గర్భంలోనే బోటు ఉండటంతో పూర్తిగా ధ్వంసమైంది. బోటులో ఏడు మృతదేహాలు కనిపిస్తున్నప్పటికీ.. అందులో ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయన్నది అధికారికంగా ప్రకటించలేదు. నీటిలో తేలియాడుతున్న మరికొన్ని మృతదేహాలను ఒడ్డుకు చేరుస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టువీడకుండా బోటు వెలికితీసిన ధర్మాడి సత్యం బృందానికి సమీప గ్రామాల ప్రజలు అభినందనలు తెలిపారు.  బోటును ఒడ్డుకు చేర్చిన అనంతరం ధర్మాడి సత్యం మీడియాతో మాట్లాడుతూ..లోతు ఎక్కువగా ఉండటం వల్లే వెలికితీత ప్రక్రియ ఆలస్యమైందని తెలిపారు. బోటును వెలికితీసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బోటు వెలికితీతలో విశాఖ స్కూబా డైవర్లు చేసిన కృషి మరువలేనిదని చెప్పారు.

Comments