Skip to main content

ఆర్టీసీఎండీని ఎందుకు నియమించలేదు?:హైకోర్టు

 
ఆర్టీసీఎండీని ఎందుకు నియమించలేదు?:హైకోర్టు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సమ్మె నివారణకు తీసుకున్న చర్యలేంటని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి పరిష్కారం చూపకపోతే మరింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చని అభిప్రాయపడింది. ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాలుస్తోందని.. ఆ సంస్థకు ఎండీని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఫిలిప్పీన్స్‌లోనూ సమ్మెలతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. కార్మికులకు నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.
ఆర్టీసీకి ఎండీని నియమించి ఉంటే కార్మికుల్లో నమ్మకం ఏర్పడి ఉండేదని.. ఎండీ నియామకం, హెచ్‌ఆర్‌ఏ పెంపు వంటి డిమాండ్లు న్యాయబద్ధమైనవని పేర్కొంది. సమ్మెతో ప్రజలు రెండువారాలుగా ఇబ్బంది పడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. రేపటి బంద్‌కు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు క్యాబ్‌ డ్రైవర్లు మద్దతిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై అదనపు ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కార్మికుల డిమాండ్లు నెరవేర్చడం సాధ్యం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి వల్లే ఎండీ నియామకం చేపట్టలేదని వివరించారు. ప్రభుత్వ వాదనపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికుల డిమాండ్లలో ఆర్థికంగా సంబంధం లేనివి కూడా ఉన్నాయని అభిప్రాయపడింది. మెరుగైన వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, స్పేర్‌ పార్టుల కొనుగోలు తదితర అంశాలు పరిష్కరించదగినవే కదా అని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆర్టీసీ సమ్మెతో ఆదిలాబాద్‌ ఏజెన్సీలో వైద్యం కోసం ప్రజలు పట్టణాలకు రాలేకపోతున్నారని.. కార్మికులతో చర్చలు జరపాలని న్యాయస్థానం మరోసారి సూచించింది. చర్చల సారాంశాన్ని తెలపాలంటూ.. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

Comments