Skip to main content

రాజకీయ కక్షతోనే దుష్ప్రచారం: చంద్రబాబు

రాజకీయ కక్షతోనే దుష్ప్రచారం: చంద్రబాబు
ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే జగన్‌ హామీలిచ్చారా అని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  మంగళగిరిలో నూతనంగా నిర్మిస్తున్న తెదేపా కేంద్ర కార్యాలయ భవనం పనులకు అడ్డంకులు కల్పించేందుకే ఆక్రమణ పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పనిచేసే కూలీలు వేసుకున్న షెడ్లను కూడా ఆక్రమణలని ఆరోపణలు చేయడం  రాజకీయ దివాళాకోరుతనమని ఆక్షేపించారు. 3 బృందాలుగా అధికారులు పదే పదే తనిఖీలు చేయడం, ట్రాన్స్‌ఫార్మర్‌ తీసేయమనడం, విద్యుత్‌ సరఫరా నిలిపివేసి పనులు అడ్డుకోవడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్నారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసికూడా వైకాపా కార్యకర్తలు 4 లక్షల మందికి గ్రామ వాలంటీరు, సచివాలయ ఉద్యోగాలు ఎలా ఇచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలుగుదేశం ప్రభుత్వం ఆదాయమార్గాలు పెంచుతూనే... పేదల సంక్షేమం కోసం కృషి చేసిందని, ఆ సమతుల్యత ఇప్పుడెందుకు లేకుండా పోయిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.  రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి, ఆదాయం పడిపోయి ప్రభుత్వంపైనే నమ్మకం లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్‌లు కామధేనువుగా మారాయని ధ్వజమెత్తారు.

Comments