అర్చకులు, బ్రాహ్మణుల పట్ల టీడీపీ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. వంశపారం పర్యంగా అర్చకులకు న్యాయం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ఆంధ్రప్రదేశ్ అర్చకుల సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కు వారు తమ కృతఙ్ఞతలు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, సెంట్రల్ నియోజక వర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణును వారు సన్మానించారు. విజయవాడ, బ్రాహ్మణ వీధిలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, జీవో 439 విడుదల చేయడం ద్వారా అర్చకుల చిరకాల స్వప్నాన్ని సీఎం జగన్ నెరవేర్చారని ప్రశంసించారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణులను ఓటు బ్యాంకుగా మాత్రమే చంద్రబాబు చూశారని, అర్చకులను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు.
2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ చట్టాన్ని తీసుకు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్ హయాం తర్వాత అధికారంలో ఉన్న వాళ్లు ఆ చట్టాన్ని అమలు చేయలేదని చెప్పారు. దీనిపై పాదయాత్ర సమయంలో జగన్ ని కలిసిన అర్చకులు తమ సమస్యను విన్నవించుకున్నారని, నాడు వారికి ఇచ్చిన హామీని నేడు జగన్ నెరవేర్చారని చెప్పారు.
ఈ జీవో విడుదలైన దగ్గర నుంచి అర్చకులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం నిమిత్తం ఇస్తున్న మొత్తం రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచుతామని, అర్చకులకు, బ్రాహ్మణులకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు.
ఈ జీవోతో అర్చకులకు భరోసా లభిస్తుంది: కోన రఘుపతి
అర్చకుల కోరిక మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని జీవో 439 ద్వారా ఆచరణలో చూపారని కోన రఘుపతి అన్నారు. బ్రాహ్మణ, అర్చక సంఘాల ఎన్నో ఏళ్ల కలను సీఎం జగన్ సాకారం చేశారని కొనియాడారు. ఈ జీవో విడుదలతో అర్చకులకు వారి కుటుంబాల్లో ఉన్న భయాందోళనలు తొలగాయని అన్నారు. దేవుడి సేవలో సంతోషంగా నిస్వార్థంగా పనిచేసుకునేందుకు అర్చకులకు ఈ జీవో ద్వారా భరోసా లభిస్తుందని చెప్పారు.
అర్చకుల సమస్యలు పరిష్కరిస్తాం: మల్లాది విష్ణు
అర్చకులు సంక్షేమం నిమిత్తం వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 439 చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడతామని, అర్చకుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం, కోన రఘుపతిని, వెల్లంపల్లిని, మల్లాదిని అర్చకులు ఘనంగా సన్మానించారు.
Comments
Post a Comment