జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేయడంపై కొందరు నేతలు మొసలి కన్నీరు కార్చుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జల్గావ్ లో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. కశ్మీర్ లో భవిష్యత్తులో తిరిగి ఆర్టికల్ 370ని తీసుకురాగలరా? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ఆర్టికల్ 370ని తీసుకొస్తామని తమ మేనిఫెస్టోల్లో పొందుపర్చాలని ఆయన సవాలు విసిరారు. దేశ ప్రజలు ఇందుకు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు.
జమ్మూకశ్మీర్ లో వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వారి హక్కులను తాము పునరుద్ధరిస్తామని మోదీ చెప్పారు. జమ్మూకశ్మీర్, లద్దాక్ ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల నేతలు మాట్లాడుతున్న మాటలు పాక్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లా ఉన్నాయని ఆయన అన్నారు. దేశాభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లకే తమ ప్రభుత్వం సవాళ్లు విసురుతూ వాటిని పరిష్కరించేందుకు పని చేస్తోందని మోదీ చెప్పారు.
Comments
Post a Comment