టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం చూసి సచివాలయ వ్యవస్థను తానే తీసుకొచ్చానని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శించారు. ఆ సచివాలయం వేరు, సీఎం జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ వేరు అన్న బాబు తెలుసుకోవాలని సెటైర్లు విసిరారు. గ్రామ సచివాలయ వ్యవస్థను చంద్రబాబు తెచ్చాడా? అని ప్రశ్నించారు. ఏపీలో నిన్న ప్రారంభించిన ‘కంటి వెలుగు’ పథకం టీడీపీ హయాంలో ఉన్నదే అని బాబు వ్యాఖ్యానించడంపైనే ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబుకు బుద్ధి, కంటిచూపు మందగించి ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రజా రంజక పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ ఆసుపత్రిలో చేరారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజులుగా రౌత్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారని, చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు రౌత్ సోదరుడు సునీల్ తెలిపారు. తన సోదరుడు రేపు డిశ్చార్జ్ అవుతాడని సునీల్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో రౌత్ ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Post a Comment