Skip to main content

విశాఖలో పవన్ తలపెట్టిన ర్యాలీకి టీడీపీ మద్దతు ఇస్తుంది: చంద్రబాబు

 


ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరత కారణంగా జరిగిన ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావిస్తామని అన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందని నిలదీశారు. ఇసుక కొరత సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ తలపెట్టిన ర్యాలీకి టీడీపీ మద్దతు ఉంటుందని తెలిపారు. టీడీపీ తరఫున సీనియర్ నేతలు ర్యాలీలో పాల్గొంటారని వెల్లడించారు.

పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోవడం వల్లే రాష్ట్రంలో కొరత ఏర్పడిందని చంద్రబాబు స్పష్టం చేశారు. వరదల కారణంగా ఇసుక తవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోందని, మరి తెలంగాణలో వర్షాలు పడుతున్నా ఇసుక కొరతలేదని, దీనికి ప్రభుత్వం ఏంచెబుతుందని ప్రశ్నించారు. తక్షణమే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని అన్నారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు టీడీపీ తరఫున లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.

కాగా, రాష్ట్రంలో తీవ్రం అయిన ఇసుక కొరత అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ నవంబరు మొదటివారంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments