Skip to main content

రాజకీయ కక్షలతో కేసులు నమోదు చేయొద్దు: ఏపీ డీజీపీకి ‘జనసేన’ నేత నాదెండ్ల విజ్ఞప్తి

అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు చిలకం మధుసూదనరెడ్డిపై గత నెలలో పోలీస్ కేసు నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ లేఖ రాశారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన అక్రమ కేసుగా భావిస్తున్నామని అన్నారు. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 30న ఆయనపై కేసు దాఖలైందని, ఎఫ్ఐఆర్ నెంబర్ 327/2019తో ఈ కేసు ఉందని పేర్కొన్నారు.

ఆరోజు సాయంత్రం ధర్మవరం పట్టణంలో మున్సిపల్ సిబ్బంది విధులకు మధుసూదనరెడ్డి ఆటంకం కలిగించారంటూ ఎఫ్ఐఆర్ లో రాశారని, వాస్తవానికి ఆ సమయంలో తాను పట్టణంలోనే లేనని, బెంగళూరులో ఉన్నట్టు మధుసూదనరెడ్డి తగిన ఆధారాలు చూపిస్తున్నారని డీజీపీ దృష్టికి తెచ్చారు. బెంగళూరులో ఉన్న వ్యక్తి ఏవిధంగా ధర్మవరం మున్సిపల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించగలరని అన్నారు.

ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ కేసు నుంచి మధుసూదనరెడ్డికి విముక్తి కలిగించేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. రాజకీయ కక్షలతో కేసులు నమోదు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

Comments