Skip to main content

పీకే‌ టీమ్ మెంబర్‌కు జగన్ బంపరాఫర్.. కీలక బాధ్యతలు..!

Jagan appoints Brahmananda Patra as AP Chief digital director, పీకే‌ టీమ్ మెంబర్‌కు జగన్ బంపరాఫర్.. కీలక బాధ్యతలు..!
ఏపీ జగన్ సర్కారులో మరో ఇద్దరు భాగమయ్యారు. సీవీ రెడ్డి, బ్రహ్మానంద పాత్ర అనే ఇద్దరిని ఏపీ ప్రభుత్వంలో చీఫ్ డిజిటల్ డైరెక్టర్లుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సమాచార పౌర సరఫరాల శాఖలోని సోషల్ మీడియా విభాగంలో వీరిద్దరు విధులు నిర్వహించనున్నారు. గతంలో గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి అనే వ్యక్తిని చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌గా జగన్ ప్రభుత్వం నియమించగా.. ఇప్పుడు మరో ఇద్దరికి ఆ అవకాశం ఇచ్చింది. కాగా తాజాగా నియమితులైన ఇద్దరిలో బ్రహ్మానంద పాత్ర అనే వ్యక్తి ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ టీమ్ సభ్యుడు కావడం విశేషం.
అయితే వైఎస్ జగన్ అధికారంలోకి రావడం వెనుక ప్రశాంత్ కిశోర్ రచించిన వ్యూహాలు ముఖ్య పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు జగన్ డిజిటల్ సపోర్ట్, స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరించారు. ఈ క్రమంలో జగన్‌ టూర్లపై పాటలు విడుదల చేయడం, ప్రత్యర్థి పార్టీలను కౌంటర్ చేయడం, వారి వ్యాఖ్యలకు దీటుగా బదులివ్వడం లాంటి బ్యాక్ గ్రౌండ్ వ్యవహారాలను ఆయన నిర్వహించారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రశాంత్ కిశోర్ బీహార్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి వైసీపీకి ఐప్యాక్ నుంచి ప్రత్యక్షంగా ఎలాంటి సేవలు అందించడం లేదు. అయితే ఇప్పుడు ఐప్యాక్‌లో ప్రశాంత్ కిశోర్ టీమ్‌లో కీలకంగా పనిచేసిన వ్యక్తికి ఏపీ ప్రభుత్వంలో బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక జగన్ వ్యూహం ఉందని పలువురు భావిస్తున్నారు.

Comments