Skip to main content

ఆ ఎమ్మెల్యే వ‌ద్దు.. గ‌ళ‌మెత్తిన‌ ఉమాభార‌తి



హ‌ర్యానా అసెంబ్లీ ఫ‌లితాలు ర‌స‌వ‌త్త‌రంగా వెలుబ‌డిన విష‌యం తెలిసిందే. బీజేపీ 40 సీట్ల‌తో ఆధిక్యంలో ఉన్నా.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన బ‌లం లేదు. దీంతో స్వ‌తంత్య్ర ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఆ పార్టీలో చేరుతున్నారు. ఆ జాబితాలోనే ఎమ్మెల్యే గోపాల్ కండా కూడా ఉన్నారు. గ‌తంలో బీజేపీలోనే ఉన్న అత‌ను.. లైంగిక దాడి ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆ పార్టీకి దూరం అయ్యారు. సిర్‌సా నుంచి గెలిచిన గోపాల్ కండా ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. మ‌ద్ద‌తు ఇస్తానంటూ ముందుకువ‌చ్చాడు. కానీ ఆ పార్టీ మ‌హిళా నేత‌లు ఆ ఎమ్మెల్యేను తీసుకోవ‌ద్దు అంటూ త‌మ అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. హ‌ర్యానాలో ప్ర‌భుత్వ ఏర్పాటును స‌మ‌ర్థిస్తున్నా.. గోపాల్ లాంటి ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి తీసుకోరాదు అని సీనియ‌ర్ నేత ఉమాభార‌తి ట్వీట్ చేశారు. పార్టీలో మోదీ లాంటి శ‌క్తివంత‌మైన నేత ఉన్న‌ప్పుడు .. గోపాల్ లాంటి ఎమ్మెల్యేలు ఎందుకు అని ఆమె ప్ర‌శ్నించారు. రేప్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న గోపాల్ కండాను బీజేపీ స్వాగ‌తిస్తోంద‌ని, అంటే ఆ పార్టీకి మ‌హిళ‌ల భ‌ద్ర‌త ప‌ట్ల చిత్త‌శుద్ధి లేద‌ని మ‌హిళా కాంగ్రెస్ నేత సుష్మితా దేవ్ విమ‌ర్శించారు. 90 సీట్లు ఉన్న హ‌ర్యానాలో కాంగ్రెస్ 31, జేపీపీ 10 సీట్లు నెగ్గాయి. బీజేపీకి చెందిన 8 మంది మంత్రులు ఓట‌మిపాల‌య్యారు.

Comments