Skip to main content

ఇంద్రకీలాద్రిపై అవస్థలు పడ్డ రెబల్ స్టార్!

కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ గా సుపరిచితుడైన సీనియర్ నటుడు కృష్ణంరాజు, ఇంద్రీకీలాద్రిపై అవస్థలు పడ్డారు. తానెవరో తెలిసి కూడా, అధికారులు కనీస సౌకర్యాలను కల్పించలేదని, మెట్లు ఎక్కుతూ దిగుతూ, ఆరు అంతస్తులు ఎక్కాల్సి వచ్చిందని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. దసరా సందర్భంగా నిన్న ఘాట్ రోడ్డు మీదుగా కృష్ణంరాజు కుటుంబం కొండపైకి రాగా, తాను కుంకుమార్చనకు వెళ్లాలని ఆయన పోలీసులను కోరారు. అయితే, వారు పట్టించుకోలేదు. ఆలయ సిబ్బందిని అడిగినా, అదే స్పందన వచ్చింది.

 దీంతో ఆయన ఫ్యామిలీ మొత్తం ఈవో కార్యాలయానికి చేరుకుని, ఆ పక్కనే ఏర్పాటు చేసిన క్యూలైన్ లో కుంకుమ పూజలను జరిపిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. సాధారణ భక్తులతో పాటు అవస్థలు పడుతూ మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఆయన ఆరో అంతస్తుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన చాలా చోట్ల ఆయాస పడుతూ, గ్రిల్స్ పట్టుకుని నిలబడటం కనిపించింది. తాను నడవలేనని ఆలయ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. తమ అభిమాన నటుడిని చూసిన భక్తులు, ఆయన పడుతున్న అవస్థలను చూసి ఆలయ సిబ్బందిపై విమర్శలకు దిగడంతో, ప్రత్యేక విశేష కుంకుమార్చన చేయించిన అధికారులు, అమ్మవారి ప్రసాదాలను అందించారు.   

Comments