అధికారులు చేసిన ఓ పొరపాటుకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రెండు సార్లు ప్రమాణస్వీకారం చేయాల్సి వచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ ఆయన చేత ప్రమాణం చేయించారు. అయితే, ప్రమాణస్వీకార పత్రంలో ఆంధ్రప్రదేశ్ బదులుగా మధ్యప్రదేశ్ అని రాసి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్, చీఫ్ జస్టిస్ ఇద్దరూ మధ్యప్రదేశ్ అనే చదివారు. వెంటనే జరిగిన పొరపాటును గ్రహించారు. దీంతో, ఆంధ్రప్రదేశ్ అంటూ చీఫ్ జస్టిస్ తో గవర్నర్ మరోసారి ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ కూడా హాజరయ్యారు.
జనసేనాని పవన్ కల్యాణ్ తీరిక సమయాల్లో హైదరాబాద్ శివార్లలోని తన ఫాంహౌస్ లో గడుపుతారన్న విషయం తెలిసిందే. పవన్ వ్యవసాయ క్షేత్రంలో మామిడి, ఇతర ఫల వృక్షాలు ఎన్నో దర్శనమిస్తాయి. అనేక రకాల కూరగాయలు కూడా పండిస్తారు. అంతేకాదు, పెద్ద సంఖ్యలో గోవులను కూడా పవన్ పోషిస్తున్నారు. అందుకోసం తన ఫాంహౌస్ లో గోశాల ఏర్పాటు చేశారు. ఇవాళ ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ క్రమంలో గోశాలను సందర్శించిన సందర్భంగా గోవులతో ఉల్లాసంగా గడిపారు. వాటికి అరటి పండ్లు తినిపిస్తూ మురిసిపోయారు. కొన్ని ఆవులు అరటిపండ్లు అందుకునేందుకు ఎంత తొందరపడుతున్నాయో అంటూ ట్విట్టర్ లో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Post a Comment