Skip to main content

నువ్వు గంభీర్ కెరీర్ ముగించావా? మరి నీ కెరీర్ ఎవరు ముగించారో తెలుసా?: పాక్ బౌలర్ ను ఆటాడుకుంటున్న నెటిజన్లు

టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ కెరీర్ ను తానే ముగించానని, తన బౌలింగ్ అంటే గంభీర్ జడుసుకునేవాడని, చివరికి తనను సూటిగా చూడ్డానికే భయపడేవాడని పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఇర్ఫాన్ కోతలు కోసిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. "అసలింతకీ ఈ ఇర్ఫాన్ ఎవరో తెలియడంలేదే, అతని కోసం గూగుల్ లో వెతకాలనుకుంటా!" అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు.

"నువ్వు గంభీర్ కెరీర్ ముగించావా? మరి నీ కెరీర్ ముగించింది ఎవరో తెలుసా?... నువ్వే. నీ కెరీర్ కు నువ్వే ముగింపు పలికావు. మ్యాచ్ ఫిక్సర్లు నిన్ను నాలుగు సార్లు కలిసినా మీ క్రికెట్ బోర్డుకు సమాచారం అందించలేదు. తప్పు చేశావు. అందుకే నిన్ను నాలుగేళ్ల పాటు నిషేధించారు. గంభీర్ ఓ వరల్డ్ కప్ విన్నర్. మరి నువ్వు, ఓ అవినీతిపరుడివి" అంటూ నెటిజన్లు ఘాటుగా విమర్శించారు.

అసలు, గంభీర్ పై ఇర్ఫాన్ స్పందించడానికి కారణం అఫ్రిది! భారత్ పై విషం చిమ్మడానికి ముందుండే అఫ్రిదీని ఇటీవలే గంభీర్ తీవ్రంగా విమర్శించాడు. అందువల్లే గంభీర్ పై ఇర్ఫాన్ అవాకులుచెవాకులు పేలినట్టు అర్థమవుతోంది.

Comments