Skip to main content

అందుకే మినహాయింపు కోరుతున్నా: జగన్‌

అందుకే మినహాయింపు కోరుతున్నా: జగన్‌
అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్‌ దాఖలు చేసిన సమయంలో సీబీఐ వాడిన  భాషతీరుపై జగన్‌ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఊహాజనిత ఆరోపణలతో పిటిషన్‌కు సంబంధం లేని అంశాలను సీబీఐ తన కౌంటర్‌లో ప్రస్తావించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినట్లు జగన్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాను హాజరుకాకపోతే విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో సీబీఐ తెలపాలన్నారు. గత ఆరేళ్లలో ఎన్నడూ కేసుల వాయిదా కోరలేదని.. స్టే కూడా అడగలేదన్నారు.
గతంలో పాదయాత్ర కోసం మినహాయింపు కోరితే.. రాజకీయ అవసరాల కోసం ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందని జగన్‌ గుర్తు చేశారు. అసౌకర్యంగా ఉందని హాజరు మినహాయింపు కోరడం లేదని.. సీఎంగా పరిపాలన చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసమే హాజరు మినహాయింపు కోరుతున్నానని న్యాయస్థానానికి వివరించారు. సాక్షులను ప్రభావితం చేసినట్లు ఆరేళ్లలో ఒక్క ఆరోపణ అయినా ఉందా అని జగన్‌ ప్రశ్నించారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే సీబీఐ కోర్టు, హైకోర్టు జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించాయన్నారు. జగన్ హోదా మినహా కేసు పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. అవసరం ఉన్నప్పుడు పిటిషన్ వేసి ఆ ఒక్క రోజుకు హాజరు మినహాయింపు తీసుకుంటూనే ఉన్నారని.. ఇప్పుడు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం..తీర్పును నవంబర్‌ 1కి వాయిదా వేసింది.

Comments