రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యతో లక్షలాది మంది కార్మికులు పనుల్లేక
బాధపడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆవేదన
వ్యక్తంచేశారు. వైకాపా ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి గానీ ఉన్న
ఉద్యోగాలను తీసేయకూడదని అన్నారు. అసలు అమరావతిలో రాజధాని కడతారా? లేదా?
స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన్ను ఇసుక
లారీ యజమానులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ
పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు పోరాటం
చేస్తామన్నారు. ఇసుక లారీల యజమానులు తనను కలిసి బాధపడ్డారనీ.. ఇసుక రవాణా
ఆగిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారని వెల్లడించారు. ప్రభుత్వ
విధానం వల్ల తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన చెందుతున్నారని పవన్
తెలిపారు. ఇసుక కొరత ప్రభావం అన్ని వర్గాల ప్రజలపైనా ఉందన్నారు. భవన
నిర్మాణ కార్మికులను ఆదుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని జనసేనాని
స్పష్టంచేశారు. ప్రభుత్వ పరిపాలన తీరు చాలా బాధను కల్గిస్తోందన్నారు.
ప్రజల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని
సూచించారు. ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ అర్ధరాత్రి పూటే ఎందుకు? అని
ప్రశ్నించారు.
రాజధాని ఉందో, లేదో తెలియదు.. బొత్స వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు..
‘‘రాయలసీమ నుంచి లాయర్లు వచ్చి కలిశారు. హైకోర్టు తమ ప్రాంతంలో ఏర్పాటు
చేయాలని అడుగుతున్నారు. రాయలసీమ నుంచే ఎక్కువ మంది సీఎంలు వచ్చారు. రాష్ట్ర
విభజన దగ్గర నుంచి ఇప్పటిదాకా సమస్యలు తీరలేదు. రాజధాని ఉందో లేదో
తెలియదు. మంత్రి బొత్స వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కోపాలు, తాపాలు ఉంటే
రాజకీయాల్లో చూసుకోండి. మీ నిర్ణయాల వెనుక కోట్ల మంది ప్రజలు ఉన్నారని
మరచిపోవద్దు. హైకోర్టులో కప్పు టీ కూడా దొరకడంలేదు.. బెంచీలు కూడా లేవు.
సరైన వసతుల్లేవు. అసలు రాజధాని కడతారా? కట్టరా? హైకోర్టును రాయలసీమకు
తరలిస్తారా?ఇలాంటి అంశాలను స్పష్టంగా తెలియజేయాలి. వీటిపై గందరగోళం ఆపండి.
సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు’’ అని పవన్
ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆ జీవోపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం!
‘‘ఇసుక
సంక్షోభంతో 30లక్షల మంది రోడ్డున పడ్డారు. కానీ ఇసుక సరఫరాపై ఇప్పటికీ
స్పష్టతలేదు. తెదేపా తప్పులు సరిదిద్దే క్రమంలో కొత్త సమస్య సృష్టించారు.
6వేల ఇసుక లారీలు కొత్తగా ఇస్తామని చెబుతున్నారు. ఈ లారీలకు జీఎస్టీ
తగ్గించాలని ఏకంగా 486 జీవోను తీసుకొచ్చారు. ఇలా జీవో తేవడం సరికాదు.
దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం’’ అని పవన్ అన్నారు.
Comments
Post a Comment