Skip to main content

తమ వారితో మాట్లాడి వస్తామని వెళ్లిన జేఏసీ నేతలు ఇప్పటివరకు రాలేదు: ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ

తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీకి మధ్య ఇవాళ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చల సరళి పట్ల ఆర్టీసీ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తమ వాదన వినిపించారు. హైకోర్టు ఆదేశించిన మేరకే ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపామని వెల్లడించారు. హైకోర్టు చెప్పినట్టే 21 అంశాలపై చర్చలు జరిపామని, అయితే తమ వారితో మాట్లాడి వస్తామని వెళ్లిన కార్మిక సంఘాల నేతలు మళ్లీ రాలేదని అన్నారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తప్ప మిగతా డిమాండ్లపై చర్చిద్దామని తాము ప్రతిపాదించామని, కానీ జేఏసీ నేతలు అంగీకరించలేదని సునీల్ శర్మ తెలిపారు. ఇతర ముఖ్యులతో మాట్లాడి వస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు చర్చల మధ్యలోనే నిష్క్రమించారని వివరించారు. చాలాసేపు వారికోసం చూసినా తిరిగి రాలేదని అన్నారు. ఇక, చర్చల మధ్యలో అంతరాయం కలిగిస్తాయన్న ఉద్దేశంతోనే జేఏసీ నేతల మొబైల్ ఫోన్లు అనుమతించలేదని సునీల్ శర్మ వివరణ ఇచ్చారు.

Comments