Skip to main content

మణి... అలా ‘గీతాంజలి’గా మారిపోయారు

 
మణి... అలా ‘గీతాంజలి’గా మారిపోయారు
తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తిండిపోయే నటి ‘గీతాంజలి’. ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలో సీతగా ఎన్టీఆర్‌ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఆమె తనదైన నటనతో మెప్పించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హాస్యనటిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నవ్వులు పూయించారు. పెళ్లయిన తర్వాత గృహిణిగా మారిన ఆమె.. ఆ తర్వాత  కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ‘పెళ్లైన కొత్తలో..’ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి, పలు టెలివిజన్‌ సీరియల్స్‌లోనూ నటించి అలరించారు. గురువారం ఆమెకు గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. అసలు గీతాంజలి తొలి సినిమా అవకాశం ఎలా దక్కించుకున్నారు? ఎన్టీఆర్‌, సావిత్రిలతో ఆమెకున్న అనుబంధం ఎలాంటిది? మణి.. అనే పేరు గీతాంజలిగా ఎలా మారింది? ఇలా ఎన్నో విశేషాలను ఆమె ఓ సందర్భంలో పంచుకున్నారు అవన్నీ ఆమె మాటల్లోనే...
అలా ఎన్టీఆర్‌ పక్కన సీతగా..
‘‘అవునండీ, నన్ను ఇప్పటికీ చాలామంది ఎన్టీఆర్‌గారి సీత అనే అనే పిలుస్తారు. ఆ సినిమా నాకు తెచ్చిన పేరు అలాంటిది. అయితే, ఆ గొప్పదనమంతా ఆ పాత్రకు నన్ను ఎంపిక చేసి సీతగా తీర్చిదిద్దిన ‘పెద్దాయన’దే. హీరోయిన్‌గా అది నా తొలి సినిమా. మొదటి చిత్రం ‘రాణీ రత్నప్రభ’. బి.ఎ. సుబ్బారావుగారి పిక్చర్‌. అందులో ఓ డ్యాన్స్‌ బిట్‌లో నన్ను చూసిన రామారావుగారు ‘ఆ అమ్మాయి ఎవరు’ అని అడిగారట. ‘వాళ్లది కాకినాడ. కొత్తగా వచ్చారు’ అన్నారట సుబ్బరావుగారు. ‘ అమ్మాయి బాగుంది. మొహంలో అమాయకత్వం ఉంది. సీత పాత్రకు నప్పుతుంది. ఓసారి మన ఆఫీస్‌కు రమ్మనండి’ అని చెప్పారట. అంతే అలా సీతారామ కల్యాణంలో హీరోయిన్‌ను అయిపోయా’’

మణి... అలా ‘గీతాంజలి’గా మారిపోయారు
పద్ధతులు నేర్పిన ఎన్టీఆర్‌
‘‘రెండేళ్లపాటు రామారావుగారి నేషనల్‌ ఆర్ట్స్ బ్యానర్‌లో పనిచేసేలా ఒప్పందం. డైలాగ్స్‌, డ్యాన్స్‌, యాక్షన్‌ అన్నీ ఆయనే నేర్పించేవారు. ఈనాటికీ, నా నోటి నుంచి ‘రా’ ‘పో’ అన్నమాటలు రావు. రండి.. కూర్చోండి.. అనే అంటాం. పెద్దాయన మాకు నేర్పిన పద్ధతులు అలాంటివి. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఆ సినిమా వందరోజుల ఫంక్షన్‌ను ఓ పెళ్లి వేడుకలా చేశారు. ఆ రోజును నేనెప్పటికీ మర్చిపోలేను’’

మాది కాకినాడ
‘‘ నా అక్షరాభ్యాసం నృత్యమే. నాన్న ముందుగా డ్యాన్స్‌ బడిలోనే వేశారు. కాన్వెంట్‌లో 9వ తరగతి వరకూ చదువుకున్నా. ‘పిల్లలు బాగున్నారు. సినిమాల్లో రాణిస్తారు’ అన్న ఆలోచనతో నాన్న పుణెకు మారారు. మేం మొత్తం నలుగురు అమ్మాయిలం. ఒక అన్నయ్య. మాది కాకినాడ. అమ్మ శ్యామలాంబ. చాలా చక్కగా వంట చేసేది. సెట్స్‌లో ఉన్నప్పుడు నాన్న క్యారియర్‌ తీసుకొస్తే అందరం కలిసి తినేవాళ్లం. ముఖ్యంగా రామారావుగారికి మా ఇంటి వంటంటే మహా ఇష్టం. గీతాంజలి ఇంటి నుంచి క్యారియర్‌ వచ్చిందంటే అందులో ఏదో స్పెషల్‌ ఉండే ఉంటుంది అనే వారు. మా అమ్మ చేపలకూర, చికెన్‌ ఫ్రై, బిర్యానీ బాగా చేసేది’’

మణి... అలా ‘గీతాంజలి’గా మారిపోయారు
పద్మనాభానికి జోడీగా..
‘‘హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు పద్మనాభంగారి బ్యానర్‌లో సినిమాలను ఒప్పుకొన్నా. ఆయనా నేనూ కలిసి చాలా సినిమాల్లో నటించాం. క్రమంగా గీతాంజలి అనగానే పద్మనాభంగారి హీరోయిన్‌, కమెడియన్‌ అనే ముద్ర పడిపోయింది. సినిమా ఏదైనా, ‘హీరో హీరోయిన్లు ఎవరైనా జంటగా పద్మనాభం-గీతాంజలి ఉంటారులే’ అన్న టాక్‌  పరిశ్రమలో ఉండేది. దాంతో వేషాలకు వెతుక్కునే పని లేకుండా పోయింది. కానీ, హీరోయిన్‌ ముద్ర కూడా పోవడం కొంత బాధనూ కలిగించింది. అయితే కొన్ని సినిమాల్లోనైనా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు దొరకడం నా అదృష్టం. అదేంటోగానీ నాకన్నీ హిట్‌ సాంగ్సే పడేవి. ‘లేత మనసులు’లో వ్యాంప్‌గానూ చేశాను. ‘సంబరాల రాంబాబు’లో నాది వెరైటీ పాత్ర. ‘ఇల్లాలు’, ‘అబ్బాయిగారు-అమ్మాయిగారు’, ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘మురళీకృష్ణ’, ‘నవరాత్రి’ వంటి సినిమాల్లో ఎప్పటికీ గుర్తిండిపోయే మంచి పాత్రలు చేశా. ఇంకా పౌరాణికాలు, హాస్య పాత్రలు ఎన్నో’’

మణి... అలా ‘గీతాంజలి’గా మారిపోయారు
భానుమతి అంటే భయం
‘‘మా సీనియర్‌ నటీమణులు సావిత్రిగారు, అంజలీదేవి, సూర్యకాంతంగారు... అందరం ఎంతో ఐకమత్యంగా ఉండేవాళ్లం. వాళ్లంతా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. భానుమతిగారితో నటించినప్పుడు నేను కొంత భయపడ్డాను. కానీ, ఆమె నాకు ఎంతో సహకరించారు. తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. ఆవిడ సీరియల్‌ ‘అత్తమ్మ కథలు’లో నేను కోడలిగా నటించాను. ఆ షూటింగ్‌ సమయంలో ఆమె నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. ‘గీతా’ అని ప్రేమగా పిలిచేవారు. ఆమెలో నేను ఓ స్త్రీనిగాక పురుషుణ్ణే చూసేదాన్ని. ఆమె ఎప్పుడూ ఎంతో ధైర్యంగా ఉండేవారు. భానుమతిగారు మంచి జాతక నిపుణురాలు. ఎప్పుడూ అదే పనిలో ఉండేవారు. ఎవరి నక్షత్రాలు ఎలా ఉన్నాయి? రాశులు ఎలా కదులుతున్నాయి? అని గమనిస్తూ ఉండేవారు. సోమవారం మాత్రం మౌనవ్రతం. ఉపవాసం చేసేవారు. అంజలీదేవి-గుమ్మడిగార్లకు నేను కూతురిగా నటించాను. వాళ్ల కాంబినేషన్‌లో చాలా మంచి పాత్రలు చేశాను. వాళ్లు కూడా కన్నకూతురిలానే ఎంతో ప్రేమగా చూసేవారు. ‘కాలం మారింది’, ‘రుణానుబంధం’, ‘పంతాలు-పట్టింపులు’ ఇలా చాలా సినిమాల్లో చేశా’’

అలా గీతాంజలిగా మారిపోయా.
‘‘తమిళం, మలయాళం, హిందీలో కూడా పనిచేశా. హిందీలో ‘పారస్‌మణి’ నా తొలి సినిమా. బాబూభాయ్‌ మిస్త్రీగారు తీశారు. ఆయన పెట్టిన పేరే ‘గీతాంజలి’, నిజానికి నా అసలు పేరు ‘మణి’ సినిమా పేరులో మణి ఉండటంతో నా పేరు మార్చారు. ‘ఇక నుంచి నీ పేరు ఠాగూర్‌ గీతాంజలిగా మారుస్తున్నా’ అని మార్చారు. ఆ పేరు నాకు ఎంతో కలిసొచ్చింది. లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌కు అదే మొదటి సినిమా. దాని తర్వాత ‘బలరామశ్రీకృష్ణ’ అనే మరో హిందీ సినిమా చేశాం. అందులో సావిత్రిగారు బలరాముడి భార్య. నేను శ్రీకృష్ణుడి భార్య రుక్మిణిగానూ చేశాం. చంద్రకాంత్‌ దర్శకుడు. దారా సింగ్‌, సాహుమోదక్‌లు బలరామకృష్ణులుగా నటించిన ఆ సినిమా బాగా ఆడింది. షూటింగ్‌ సమయంలోనే సావిత్రిగారు నేనూ చాలా రోజులు ముంబయిలో ఉన్నాం. ఆమె ఎప్పుడూ సరదాగా ఉండేవారు. ఆమెకు ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. అయితే, అక్కడ చపాతీలు, పప్పూ తినలేకపోయేవారు. ‘ఛీ.. ఛీ ఈ గడ్డి ఇంకా ఎన్నిరోజులు తినాలి. అక్కడ కడుపునిండా తిని పని చేసుకునేవాళ్లం. మరోసారి ఈ హిందీ సినిమాలు ఒప్పుకోకూడదు’ అనేవారు. ‘లేతమనసులు’ హిందీలోనూ నా క్యారెక్టర్‌ నేను చేశాను. రీమేక్‌ సినిమా అయినా తెలుగు, హిందీ కన్నడ అన్నింటిలోనూ ఆ పాత్రలు అలాగే ఉండేవి. రోజుకు మూడు షిప్ట్‌లు పనిచేసేదాన్ని’’

మణి... అలా ‘గీతాంజలి’గా మారిపోయారు
ఆయనతో పెళ్లి..
‘‘ఎంజీఆర్‌గారి చెల్లెలుగా చాలా సినిమాల్లో చేశాను. చెల్లెలు పాత్ర అనగానే ‘గీతాంజలిని తీసుకోండి’ అనేవారాయన. ఆయన చాలా మంచి మనిషి. ఏదైనా సినిమా ఒప్పుకోకపోతే ‘నువ్వు నా చెల్లెలివేనా, నా పక్కన నటించవా’ అనేవారు. నేనూ రామకృష్ణగారూ కలిసి చాలా సినిమాల్లో చేశాం. ‘పెళ్లిరోజు’ సినిమా అప్పుడు అనుకుంటా మా ఇద్దరి పెళ్లి ప్రస్తావన వచ్చింది. మాది లవ్‌ మ్యారేజ్‌ కాదు. నాన్న కుదిర్చిన పెళ్లి. కాకపోతే రామకృష్ణగారికి నేనంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది.  పెళ్లయ్యాక ‘విశ్రాంతి తీసుకో’ అనడంతో సినిమాలకు దూరమై గృహిణిగా సెటిలైపోయా. మాకు ఓ పాప, బాబు. పెళ్లయ్యే వరకూ నాకు వంటరాదు. ఆ తర్వాతే నేర్చుకున్నా’’

జమున సాయం
‘‘రామాపురంలో సీత’ అనే సినిమా తీసి చేతులు కాల్చుకున్నాం. ‘అనవసరంగా నిర్మాణం జోలికిపోవద్దు. ఇతర పెట్టుబడులు పెట్టుకోండి’ అని ఎన్టీఆర్‌గారు ఎప్పుడూ హెచ్చరించేవారు. తర్వాతే మద్రాసులో శ్రీనివాస థియేటర్స్‌ కట్టాం. దాని ప్రారంభోత్సవం అన్నగారి చేతుల మీదుగా జరిగింది. ఆ తర్వాతి రోజు ఆయన ఇక్కడకు వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంత మంచి స్థిరాస్తి మేం కొనుక్కునేలా సాయపడింది జమున అక్క. అప్పట్లో ఎంతమంది అడిగినా ఇవ్వని ఆమె ఆ స్థలాన్ని మాకే ఇచ్చారు. అది నేనెప్పటికీ మర్చిపోలేను.’’

మణి... అలా ‘గీతాంజలి’గా మారిపోయారు
సెట్‌లో ఆట పట్టించేవారు
‘‘రామారావుగారి కుటుంబంతో నా అనుబంధం చెప్పలేనిది. ‘సీతారామకళ్యాణం’ షూటింగ్‌ సమయంలో ఎక్కువగా వాళ్లింటిలోనే ఉండేవాళ్లం. ఉదయం 5గంటలకు మేకప్‌ వేస్తే, రాత్రి ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఆయనేమో రావణాసురుడు. మొదటి రోజు భుజం మీద గద, కిరీటం, అన్నీ పెట్టుకుని ‘మాతులంగీ’ అంటూ గట్టిగా పిలుస్తూ లోపలకు వచ్చారు. భయపడకుండా ధైర్యంగా నిలబడి ఆయనను ధిక్కరిస్తూ పెద్ద డైలాగ్‌ చెప్పాలి. పైగా తొలి డైలాగ్‌. నాకేమో ఆయన్ను చూస్తేనే వణుకు... గడగడలాడిపోయేదాన్ని. ‘నీ పాత్ర, నీ డైలాగ్‌లు అంతే..  నన్ను చూసి భయపడవద్దు’ అని చెప్పేవారు. ఎలాగో ఆ డైలాగ్‌లు చెప్పా. ‘రావణాసురుడిలా ఆయన అలా నిలబడితే ఆయన్ను ఎదిరించే ఆ సీత పాత్రలో నటించడానికి ఎన్ని గుండెలు కావాలి? మీకెంత ధైర్యం. రామారావుగారికే ఎదురు చెబుతారా’ అంటూ యూనిట్‌ సభ్యులంతా నన్ను ఆటపట్టించేవాళ్లు. సీత పాత్ర మీద ఆయన చాలా శ్రద్ధ తీసుకునేవారు. బొట్టు కూడా ఆయనే పెట్టేవారు’’

జయలలితను ‘అమ్ము’ అని పిలిచేదాన్ని
‘‘సూర్యకాంతంగారికి చాలా సినిమాల్లో నేనే కూతుర్ని. ఆవిడంత స్వీట్‌ మమ్మీ ఉండరంటే అతిశయోక్తికాదు. ఆమెది పసిబిడ్డలాంటి మనసు. ఆమెలాంటి నటి మరొకరు పుట్టరు. జయలలిత, నేనూ కలిసి చాలా సినిమాల్లో చేశాం. సిస్టర్స్‌లా ఉండేవాళ్లం. ఆమె అందరితో ఎక్కువగా మాట్లాడదు. కానీ, నాకు మాత్రం మంచి స్నేహితురాలు. ఆమెను నేను ‘అమ్ము’ అని పిలిచేదాన్ని. ఎందుకంటే తను నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు. చాలా మంచి అమ్మాయి. సీఎం అయ్యాక కూడా నన్ను చాలా ఆప్యాయంగా పిలిచేవారు. భగవంతుడు నాకు ఎంతో మంచి పుట్టుక ఇచ్చాడనే అనుకుంటాను. సినీ రంగంలోనూ గృహిణిగానూ కూడా ఎంతో సంతృప్తికరమైన జీవితం నాది’’ అంటూ గీతాంజలి చెప్పుకొచ్చారు

Comments