జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ ల మధ్య వైరం మరింత ముదిరింది. ఇండియా ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైన పాకిస్థాన్... మన దేశంపై సమరనాదాన్ని పూరిస్తోంది.
తాజాగా పాకిస్థాన్ కు చెందిన కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్ వ్యవహారాల శాఖ మంత్రి అలీ అమీన్ సంచలన ప్రకటన చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే యూద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు, భారత్ కు మద్దతు పలికే దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తామని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్ కు చెందిన ఎంపీలు పర్యటిస్తున్న సమయంలో అమీన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరోవైపు, అమీన్ చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పాకిస్థాన్ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Post a Comment