Skip to main content

ఉగ్రసంస్థలను పాక్ కట్టడి చేయాలి.. లేకపోతే భారత్ పై రెచ్చిపోతాయి: అమెరికా ఆందోళన

భారత్ తో పాకిస్థాన్, చైనా సంబంధాలపై అమెరికా రక్షణ శాఖ ఇండో-పసిఫిక్ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ రాండాల్ ష్రివర్ మీడియాతో మాట్లాడారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ లో ఉగ్రమూకలు ఇష్టానుసారం రెచ్చిపోయే ప్రమాదం ఉందని, వాటిని పాక్ కచ్చితంగా నియంత్రించాలని సూచించారు. పాక్ కట్టడి చేయకపోతే ఆ ఉగ్రసంస్థలు భారత్ పై దాడులకు పాల్పడే అవకాశముందని రాండాల్ ష్రివర్ ఆందోళన వ్యక్తం చేశారు.

పాక్ కు చైనా కేవలం దౌత్య, రాజకీయపరమైన మద్దతు మాత్రమే ఇస్తుందని భావిస్తున్నామని, చైనా కూడా భారత్ తో సత్సంబంధాలనే కోరుకుంటోందని ఆయన వెల్లడించారు. కేవలం కొన్ని అంశాల్లోనే పాక్ తో చైనా సన్నిహితంగా ఉంటోందని స్పష్టం చేశారు. కానీ, ఉగ్రసంస్థలను నిలువరించే విషయంలో పాక్ వైఖరిపైనే ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయని ష్రివర్ తెలిపారు. ఉగ్రకళ్లాలు పాక్ చేతిలోనే ఉన్నాయన్న విషయం ష్రివర్ వ్యాఖ్యల ద్వారా అంతర్జాతీయ సమాజానికి మరోసారి వెల్లడైంది.

Comments