ఏపీ పోలీసులపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం మండిపడుతున్న విషయం తెలిసిందే. తాను దళితుడిని అని చెప్పి తనను ఈవిధంగా ఇబ్బందిపెడుతున్నారంటూ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది.
విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ, పోలీసులకు కులం, మతం లేవు అని, తమది ‘ఖాకీ కులం’ అని, పోలీస్ శాఖను ఎవరు కించపరిచేలా మాట్లాడినా సహించమని హెచ్చరించారు. గతంలో పోలీస్ ఉద్యోగిగా పని చేసిన వర్ల రామయ్యపై తమకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని అన్నారు.
పోలీసుల జాతకాలు తెలుసు అని, అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు. అసలు, ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాల్సిన ఆయన, డీజీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు అని విమర్శించారు. పోలీసుల జాతకాలు తన దగ్గర ఉన్నాయంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు.
పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత మాట్లాడుతూ, ఒకప్పుడు పోలీస్ గా, సంఘం సభ్యుడిగా పని చేసిన వర్ల రామయ్యకు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలియదా అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశం నిర్వహించే అర్హత పోలీసుల సంఘానికి లేదన్న వర్ల, ఎందుకు లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Post a Comment