Skip to main content

రిక్షావాలాను లక్షాధికారిని చేసిన 'వర్షం'!

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు! ఈ రిక్షావాలా విషయంలో అది నిజం అయింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన గౌర్ దాస్ వర్షం కారణంగా లాటరీలో రూ.50 లక్షలు గెలుచుకోవడం అదృష్టం కాక మరేంటి? గౌర్ దాస్ నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపూర్ లో రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సెప్టెంబరు నెలాఖరులో ఇతర రిక్షావాలాలతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అయితే, విహారయాత్రకు వెళ్లే రోజున భారీ వర్షం కురిసింది. దాంతో ఆ యాత్ర క్యాన్సిల్ అయింది. రిక్షా యూనియన్ ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా, లాటరీలు అమ్మే ఓ వ్యక్తి ఎదురొచ్చి లాటరీ కొనాలంటూ వెంటపడ్డాడు. లాటరీ విలువ రూ.30 మాత్రమే కావడంతో, సరేనని చెప్పి ఓ లాటరీ కొనుగోలు చేశాడు. వారం క్రితం లాటరీ ఫలితాలు రాగా, గౌర్ దాస్ కొన్న లాటరీ నంబర్ కు రూ.50 లక్షల బహుమతి వచ్చింది.

ఈ విషయం తెలిసి ఆ రిక్షావాలా ఆనందం అంతాఇంతా కాదు. అయితే, ఎవరికన్నా తెలిస్తే, ప్రమాదం అని భావించిన గౌర్ దాస్ కేవలం తన భార్యకు మాత్రమే లాటరీ గెలిచిన విషయం చెప్పాడు. అప్పటికప్పుడు ఆ లాటరీ సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, ఈ విషయం మీడియాలో రావడంతో అందరికీ తెలిసిపోయింది. మొత్తానికి వర్షం ఓ రిక్షావాలాను ధనవంతుడ్ని చేసింది. వర్షం పడకుండా ఉంటే, గౌర్ దాస్ పిక్నిక్ కు వెళ్లేవాడు, లాటరీ మిస్సయ్యేది! ఎవరినో వరించాల్సిన ఆ లాటరీ వర్షం కారణంగా వెతుక్కుంటూ ఆ రిక్షా వాలా చెంతకు చేరడం నిజంగా అదృష్టమే!

Comments